DJ not Allowed | ధర్మారం,డిసెంబర్ 26: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డీజే లకు ఎలాంటి అనుమతి లేదని, ఒకవేళ యువత నిబంధనలకు వ్యతిరేకంగా డీజే ప్రదర్శన చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ బీ రాంరెడ్డి స్పష్టం హెచ్చరించారు. పెద్దపెల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ (ఠాణా)ను సీఐ కే ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఠాణా ను సందర్శించిన సందర్భంగా డీసీపీ రాంరెడ్డికి స్థానిక పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేయగా ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. నేరాలు ఇతరాత్ర విషయాలపై పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేసి ఎస్సై తో పాటు సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను యువత ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ వేడుకలకు డీజే సౌండ్స్ అనుమతి లేదని దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత మెదలాలని ఆయన సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా డిజె సౌండ్స్ వినియోగించి రోడ్లపై అల్లరి చేస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా మద్యం తాగి రోడ్లపై ద్విచక్ర వాహనాలపై డ్రైవింగ్ చేసి అల్లరి చిల్లరగా వ్యవహరిస్తే వారిపై కేసు నమోదవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ క్రమంలో యువత పోలీస్ శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువత గంజాయి, మాదకద్రవ్యాల కు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా తో పాటు మత్తు పదార్థాలను సేవించిన యువతపై పోలీస్ శాఖ గట్టి నిఘా పెట్టి సమూల నిర్మూలనకు పోలీస్ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వస్తున్న బెట్టింగ్ యాప్ లకు యువత బలి కావద్దని ఆర్థికంగా నష్టపోవద్దని డీసీపీ రాంరెడ్డి సూచించారు. ఇట్టి యాప్ లపై పోలీస్ శాఖ నిఘా పెట్టాలని అని సూచించారు.