Agricultural seed shops | మల్యాల, జూన్ 12: వానాకాలం సీజన్ ప్రారంభమైనందున జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మల్యాల మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు విత్తన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే దుకాణాల వద్ద గల విత్తనాలు, బ్యాచ్ నెంబర్, కంపెనీల వివరాలు, ధర, సంచి పరిమాణం, తదితర వివరాలతో విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు దుకాణా దారులు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు.
అంతేకాకుండా యూరియా, డిఏపి లాంటి ఎరువు బస్తాల నమ్మినప్పుడు ఈపాస్ యంత్రంలో నమోదు చేసాకనే బస్తాలను విక్రయించాలన్నారు. క్షేత్రస్థాయిలో దుకాణాలలో గల సరుకు, రికార్డుల్లో గల ఉన్న సరుకు గల తేడాను పరిశీలించారు. నిత్యం వ్యవసాయ అధికారులతో అనుసంధానంగా ఉంటూ విక్రయ రిపోర్టులను అందజేయాల్సి ఉంటుందని దుకాణదారులకు సూచించారు.
అనంతరం మల్యాల గ్రామంలో పచ్చిరొట్ట విత్తనాలు సాగుచేసిన జీలుగు పంటను పరిశీలించారు. జీలుగును కలియదున్నే సమయంలో సూపర్ ఫాస్పెట్ ను వినియోగిస్తే భూమి మరింత తొందరగా సారవంతమవుతుందని తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి చంద్ర దీపక్, విస్తీర్ణ అధికారి కారుణ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.