లోక్‌సభ ఎన్నికలకు వడివడిగా..
లోక్‌సభ ఎన్నికలకు జిల్లా యంత్రాం గం మందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రాథమిక పనులను వారం క్రితమే జిల్లాల్లో ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
- ప్రాథమిక ఏర్పాట్లలో అధికారయంత్రాంగం
- సెక్టోరల్ అధికారుల నియామకాల కోసం ఈసీకి ప్రతిపాదనలు
- ప్రతి 1500 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
- ముమ్మరంగా కొనసాగుతున్న సెంటర్ల రేషనలైజేషన్
- మరోవైపు వేగంగా ఓటరు జాబితా సవరణ
- మరింత పెరగనున్న ఓటర్ల సంఖ్య
- సమాయత్తమవుతున్న పార్టీలు
లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగా వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో యావత్ యంత్రాగం సిద్ధమవుతున్నది. ప్రతి 1500 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం పోలింగ్‌కేంద్రాల రేషనలైజేషన్ కొనసాగుతుండగా.. సెక్టోరియల్ అధికారుల నియామకానికి సైతం అన్ని జిల్లాల యంత్రాంగం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించింది. మరోవైపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా, అన్ని పార్టీలు రంగంలోకి దిగేందుకు కసరత్తు ప్రారంభించాయి.
కరీంనగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : లోక్‌సభ ఎన్నికలకు జిల్లా యంత్రాం గం మందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రాథమిక పనులను వారం క్రితమే జిల్లాల్లో ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఎన్నికల సంఘం సూచించిన ఓటరు జాబితా, కొత్త ఓటర్ల నమోదు, తప్పొప్పుల సవరణ, ఒక కుటుంబంలోని ఓట్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా, అవసరమైన చర్యలను ఇప్పటికే చేపట్టింది. తాజాగా, పోలింగ్ కేంద్రాల మార్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన ఓటర్ల సంఖ్యపై క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా జిల్లా ఎన్నికల అధికారులు చేపడుతున్నారు.
ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించే రెవెన్యూ విభాగంలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు నాలుగు రోజులుగా నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులపై సంబంధిత అధికారులకు నివేదికలు పంపుతున్నారు. ఇటీవల శాసనసభా ఎన్నికలు కూడా పటిష్టంగా నిర్వహించేలా ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టింది. అయినా, కొన్ని ప్రాంతాల్లో చిన్నా చితక అవాంతరాలు ఏర్పడ్డాయి. కానీ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
1500 మంది ఓటర్లకో పోలింగ్ కేంద్రం
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగినా, కొన్నిచోట్ల మాత్రం ఈసీ నిర్దేశించిన సంఖ్య కన్నా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నది. దీంతో పోలింగ్ సమయం ముగిసినా పలుచోట్ల ఓటర్లు బారులు తీరడం కనిపించింది. ఆయా కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం మరింత సరళతరం చేసే క్రమంలో ప్రతి 1500 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై దృష్టి సారించారు. 1500 ఓటర్లకు మించి ఉన్నైట్లెతే, వాటిని విభజించి రెండు పోలింగ్ కేంద్రాలు చేయడం, ఓటర్ల నివాసాలకు దూరంగా ఉన్న కేంద్రాలను దగ్గరగా మార్చడం, ఒక కుటుంబంలోని ఓట్లన్నీ ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా జాబితా సరిచేయడం వంటి పనులు చేస్తున్నారు. ఓటర్ల సవరణ, తప్పొప్పుల పరిశీలన, మరణించిన వారి వివరాలు ఆధారాలతో సేకరించి జాబితాలోనుంచి తొలగించడం, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ముమ్మరం చేయడం వంటి పనులు చేపడుతున్నారు.
అలాగే, ఎన్నికల నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించే సిబ్బందికి అవసరమైన శిక్షణ, పోలింగ్‌కు అవసరమైన సామగ్రి సిద్ధం చేయడం, పోలింగ్ రోజున విధులు నిర్వహించే సిబ్బందికి పంపిణీ చేయడం, పోలింగ్ అనంతరం తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం వంటి ప్రణాళికను కూడా ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో క్రియాశీల పాత్ర పోషించే సెక్టోరల్ అధికారుల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి, ఎన్నికల కమిషన్‌కు పంపారు.
కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ
ఓటర్ జాబితా సవరణకే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. 2024 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అంతే కాదు, ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించాలని ఆదేశించింది. దీంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించేందుకు జిల్లా యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కరీంనగర్, పెద్దపల్లి రెండు లోక్‌సభల పరిధిలోనూ ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కరీంనగర్ లోక్ సభ పరిధిలో 17,69,040 ఓటర్లు ఉన్నారు. అలాగే, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 15,76,428 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికే ఓటర్ల సంఖ్య రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గణనీయంగా పెరిగింది. కాగా, తాజా ఓటరు జాబితా సవరణతో మరింత పెరిగే అవకాశమున్నది.
పార్టీలు సన్నద్ధం
మరోవైపు రాజకీయ పార్టీలు సైతం ఎన్నికలను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నాయి. అందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ అందిరిలో కనిపిస్తున్నది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

