కార్పొరేషన్, డిసెంబర్ 17: తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలువాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ. లక్ష కానుకగా ఇస్తున్న ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. శనివారం మంత్రి కలెక్టరేట్ ఆడిటోరియంలో 92 మంది లబ్ధిదారులకు రూ. 92.10 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులున్నా సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులిస్తున్నారని చెప్పారు. తెలంగాణ వనరులు, సంపదను దోపిడీ చేసేందుకు ఆంధ్రా నాయకులు పాదయాత్రల పేరిట తెలంగాణపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి నిరంతరాయంగా సాగాలంటే తెలంగాణ సర్కారును ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పాక్స్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, బొమ్మకల్ సర్పంచ్ పుర మల్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు, బోనాల శ్రీకాంత్, ఐలందర్ యాదవ్, తోట రాములు, నాంపెల్లి శ్రీనివాస్, స్వర్గం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.