Deworming tablets | రుద్రంగి, ఆగస్టు 11: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల, గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకు వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందితో కలిసి ఎంపీడీఓ నటరాజ్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వైద్యాధికారి ప్రభాకర్ చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని చిన్నారులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మన శరీరంలోని నులిపురుగులను సంపూర్ణంగా నిర్మూలించేందుకు, ఆహారం సంపూర్ణంగా జీర్ణమై ఆరోగ్యంగా ఉండడానికి ఈ మాత్రలు ఉపయోగపడుతాయన్నారు. 19 సంవత్సరాలలోపు విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమిరెడ్డి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ హరినాథ్, కార్యదర్శి రాందాస్, ఉపాధ్యాయులు, ఎంఎలెచ్పీలు, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లతో పాటు చిన్నారులు పాల్గొన్నారు