KARIMNAGAR EGS | కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 30 : ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతన మొత్తంపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి చట్టానికనుగుణంగా పనికి తగిన వేతనం దేవుడెరుగు… కనీసం గతేడాది కన్నా అధికంగా నైనా పెంచకపోవడం పట్ల కూలీల్లో అసంతృప్తి వెలువెత్తుతున్నది. నామమాత్రంగా పెంచి, కూలీలకు ఎంతో లబ్ది కలిగిస్తున్నట్లు ప్రకటించుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై కూలీలు మండిపడుతున్నారు.
పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా కూలీల వేతనం కూడా ఆర్థిక సంవత్సర ప్రారంభంలో పెంచాల్సిన కేంద్రం, కేవలం రూ.7 మాత్రమే పెంచడం పట్ల ధ్వజమెత్తుతున్నారు. ఉపాధి పనుల ద్వారా కూలీలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమవుతందనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 1.24 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 2.33 లక్షల పైచిలుకు మంది కూలీలు ఉన్నారు. వీరిలో నిత్యం 50 నుంచి 60 వేలకు పైగా కూలీలు ఉపాధి పథకం ద్వారా చేపట్టే వివిధ రకాల పనులకు హాజరవుతున్నారు. చట్టం ప్రకారం పనులకు హాజరయ్యే కూలీలందరికీ ఏటా ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనంలో కనీసం 10శాతం పెంచాల్సి ఉంటుంది. కానీ, ఇందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
2005లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఆరంభంలో కూలీలకు రూ.87.50 చెల్లించేది. ఏటేటా కొద్ది మొత్తంలో పెంచుకుంటూ, 2022లో రూ.13 పెంచగా, 2023లో రూ.12 పెంచింది. 2024లో రూ.15 పెంచగా రూ. 300కు పెరిగింది. తాజాగా ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.7 మాత్రమే పెంచగా కూలీల వేతనం రూ.307కు చేరింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెండంకెల్లో పెరిగిన వేతనం, ఈసారి మాత్రం ఒక అంకెకు మాత్రమే పరిమితం చేయటం పట్ల కూలీల హాజరు శాతం తగ్గించేందుకేననే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి కూలీలకు కొత్త నిబంధనలు అమలు చేస్తూ, వేల సంఖ్యలో జాబ్ కార్డులు తొలగించింది.
పని స్థలాల్లో కనీస వసతుల కల్పనకు కూడా ఎగనామం పెట్టింది. ఏటా వేసవిలో అందించే భత్యానికి కూడా గండి కొట్టింది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఆయా నెలల ననుసరించి వేతనంలో 10 నుంచి 20 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కూలీలకు చెల్లింపులు తలకు మించిన భారమవుతుందననే భావనతో, పనులు తగ్గించడంతో పాటు నిబంధనలు కఠినతరం చేసిందనే ఆరోపణలు కూలీల నుంచి వస్తున్నాయి. గతేడాది నుంచి వ్యవసాయ పనులు తగ్గుతుండగా, కూలీలంతా ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో కూలీల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండగా, అడ్డుకునే క్రమంలోనే తక్కువ మొత్తంలో వేతనం పెంచారనే విమర్శలు వస్తున్నాయి. కూలీల పొట్ట కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఉపాధి కూలీల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవ్ ఖండించారు. వేతన పెంపును సవరించాలని లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.