Vemulawada | వేములవాడ రూరల్ ఏప్రిల్ 23: పరిహారం ఇచ్చాకే సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని, పరిహారం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటామని పనులను ఆడ్డుకుని భూ నిర్వాసి త కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని సంకపల్లి శివారులో బుధవారం చోటుచేసుకుంది.
బాధితుల కథనం ప్రకారం.. సంకేపల్లి శివారులోని రుద్రవరం అరండా కాలనీలో సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే సంబంధిత అధికారులు బుధవారం స్థల పరిశీలన చేసి సర్వేనెంబర్ 3838లో 84 లో ఉన్న ఆ స్థలంలో నాంపల్లి రాజాకి చెందిన షెడ్డును తొలగించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రాజయ్య కుటుంబ సభ్యులు షెడ్డు కూల్చివేతను అడ్డుకున్నారు. తమకు షెడ్డు కు సంబంధించిన ఎలాంటి నష్టపరిహారం అందలేదని, నష్టపరిహారం చెల్లించిన తర్వాతే షెడ్డును తొలగించాలని డిమాండ్ చేశారు.
సుమారు రూ.15 లక్షల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం చెల్లించకుంటే తమ ప్రాణాలు సైతం ఇక్కడే వదిలేస్తామని హెచ్చరించారు. గతంలో జిల్లా కలెక్టర్ షెడ్డుకు సంబంధించిన పరిహారం ఇవ్వాలని చెప్పగా పరిహారం ఇవ్వకుండానే షెడ్డును తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.