Collector Garima Agarwal | సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 3 : దివ్యాంగులు అత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షానియర్ కళాశాల మైదానంలో దివ్యాంగులకు ఆటల పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు అందరితో పాటు సమానంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో యూడీఐడీ కేంద్రం అందుబాటులోకి రానున్నదని తెలిపారు. దీనిలో పూర్తి స్థాయిలో సేవలు అందుతాయని చెప్పారు.
డే కేర్ సెంటర్ సేవలు సైతం త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిని ఆదేశించారు. దివ్యాంగుల కోసం రెగ్యులర్ గా శిబిరాలు నిర్వహిస్తూ ఆబింకో ద్వారా సహాయ ఉపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.