సర్కారు బడి సరికొత్తగా మారింది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేసిన గత రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేసింది. స్కూళ్ల అవసరాలేంటి..? ఏమేమి పనులు చేయాలి..? అనే పూర్తి వివరాలు తెలుసుకొని ఆధునీకరించింది. ముఖ్యంగా విద్యార్థులు క్లాస్ రూంలో ఎకడి నుంచైనా చూసేలా 75 ఇంచుల వెడల్పు స్క్రీన్స్‌తో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయగా, హుజూరాబాద్ నియోజకవర్గంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి బోధన ప్రారంభమైంది. ఎంతో అర్థవంతంగా తరగతులు నడుస్తుండగా, ప్రత్యక్ష బోధనతో పిల్లల్లో ఆసక్తి పెరుగుతున్నది.
– హుజూరాబాద్‌టౌన్, డిసెంబర్14
Digital Classroom | స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం సరార్ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే గాక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సరారు బడుల బలోపేతానికి మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డిజిటల్ తరగతులు బోధించేందుకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో డిజిటల్ విద్యలో భాగంగా హుజూరాబాద్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర, బాలికలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు బోర్నపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల, కందుగుల, చెల్పూర్, రాంపూర్‌లోని జడ్పీహెచ్ఎస్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం డిజిటల్ తరగతులు ప్రారంభించింది.
ఆయా పాఠశాలల్లో 8,9,10వ తరగతుల వారికి డిజిటల్ విద్యను బోధిస్తున్నారు. విద్యార్థులు తరగతి గదిలో ఎకడి నుంచైనా చూసేలా 75 ఇంచుల వెడల్పుతో టీవీలను ఏర్పాటు చేశారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌సీ)లను టీవీల ద్వారా సాధారణ బోధన, కంప్యూటర్ ఉపయోగించి, ఉపాధ్యాయులు చేతి వేళ్లతో నచ్చిన రంగులతో అక్షరాలు రాసే విధంగా ఏర్పాటు చేశారు. మండలంలో ప్రతి పాఠశాలలో మూడు తరగతులకు మూడు ఐఎఫ్సీలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
గతంలో చెప్పిన పాఠాలను రికార్డు చేసి పాఠాలను వినేలా ఏర్పాటు చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు డిజిటల్ విద్య బాగా ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు పేరొంటున్నారు. చిత్రాలు, వీడియో, పాటల ద్వారా బోధించడం వల్ల వారికి ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరా లేకపోయినా డిజిటల్ విద్యను కొన్ని గంటల పాటు బోధించవచ్చని ఉపాధ్యాయులు తెలిపారు.
డిజిటల్ బోధనతో విద్యార్థులకు తొందరగా అర్థమవుతుంది. పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా చూపిస్తూ బోధిస్తుండడంతో విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ బోధన ఉపయోగకరంగా ఉంటుంది. చాక్ పీస్, డస్టర్లు లేకుండానే పాఠాలు బోధిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులకు ఎంతో ఉపయోగం.
– జీ సమ్మిరెడ్డి, హెచ్ఎం, జడ్పీహెచ్ఎస్, హుజూరాబాద్
డిజిటల్ విద్యలో భాగంగా దృశ్య బోధనతో సులువుగా నేర్చుకోగలుగుతున్నాం. పాఠ్యాంశాలు త్వరగా అర్థమవుతున్నాయి. పాఠ్యాంశాలను వీడియో రూపంలో వినడం, చూడడం ఆసక్తిగా అనిపిస్తుంది. చరిత్రకారులు, రాజకీయ నేతలు, మానవుని జీర్ణక్రియ వ్యవస్థ, గుండె, పొలాలు, రాకెట్, విమానం, మాకు తెలియని జంతువులు, వస్తువులు తదితర వాటిని వీడియో రూపంలో చూసి ఇలా ఉంటాయి..? అని అర్థం చేసుకుంటున్నాం. డిజిటల్ బోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. దీన్ని అందించిన కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– ఇందుశ్రీ, పదో తరగతి, విద్యార్థి
డిజిటల్ పద్ధతిలో పాఠ్యాంశాలను బోధించడం వల్ల చదువుపై మరింత ఆసక్తి పెరుగుతున్నది. ప్రతి అంశాన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతున్నాం. సైన్స్ పాఠమంటే ఇంతకు ముందు భయంగా ఉండేది. ప్రాజెక్టర్ ద్వారా వివరించడంవల్ల భయం పూర్తిగా పోయింది. ఇంతకు ముందు పాఠాలు వినాలంటే ఆసక్తి ఉండేది కాదు. డిజిటల్ తరగతుల వల్ల ఆసక్తి పెరిగింది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పినప్పుడు కొన్ని అంశాలను గుర్తుంచుకోలేకపోతున్నాం. తిరిగి వాటిని ప్రొజెక్టర్ ద్వారా చూపించడం వల్ల అన్ని అంశాలు గుర్తుంటున్నాయి. ముఖ్యమైన అంశాలు మరింతగా వివరంగా తెలుసుకోగలుగుతున్నాం.
– అభినవశ్రీ, 8వ తరగతి