Digital classes | సర్కారు బడి కార్పొరేట్‌ను తలదన్నుతున్నది. సాంకేతిక సొబగులద్దుకొని సరికొత్తగా మారుతున్నది. ‘మన ఊరు – మన బడి’తో రూపురేఖలు మార్చుకుంటున్నది. ఇంకా పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు వచ్చే విద్యాసంవత్సరం నుంచి 8,9,10 తరగతుల్లో డిజిటల్ బోధన చేయనున్నది. అందుకోసం జగిత్యాల జిల్లాలో 104 స్కూళ్లను విద్యాశాఖ ఎంపిక చేసి, తరగతి గదులను స్మార్ట్ క్లాస్రూములుగా మారుస్తున్నది. ఇప్పటికే 80కిపైగా పాఠశాలల్లో 75 అంగుళాలతో డిజిటల్ తెరలు, గ్రీన్ బోర్డులు, అత్యవసర విద్యుత్ వినియోగానికి ప్రత్యేకంగా యూపీఎస్‌లు ఏర్పాటు చేసింది. ఇటు టీచర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చి అంతా సిద్ధం చేయగా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, మే 18 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులు కార్పొరేట్‌కు దీటుగా తయారవుతున్నాయి. తెలంగాణ రాక ముందు కుదేలైన పాఠశాలలు, నేడు సకల హంగులను సమకూర్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెసిడెన్షియల్ విద్యను ప్రోత్సహిస్తూనే మరోవైపు సర్కారు స్కూళ్లను బలోపేతం చేయడం, ఇప్పటికే 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టడం తెలిసిందే. దీంతోపాటు పాఠశాలలను పూర్తిస్థాయిలో ఆధునీకరించి, మౌలిక వసతులను కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టి కొత్త రూపు తెస్తున్నది. జగిత్యాల జిల్లాలో స్థానిక సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యాల ఆధీనంలో 783 పాఠశాలలు ఉండగా, అందులో ‘మన ఊరు.. మన బడి’ కింద మొదటి దశలో 274 స్కూళ్లను ఆధునీకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గత విద్యా సంవత్సరం వరకే దాదాపు 70 పాఠశాలలు పూర్తి సౌకర్యాలను సమకూర్చుకోగా, మిగిలిన స్కూళ్లలో ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా, ఆధునీకరించిన పాఠశాలల్లో కొన్నింటిని డిజిటల్ పాఠశాలలకు ఎంపిక చేశారు. వచ్చే జూన్ (విద్యా సంవత్సరం) నుంచే ఆయా పాఠశాలల్లో డిజిటల్ పద్ధతిలోనే పాఠ్యాంశాల బోధన సాగనున్నది.
8, 9, 10 తరగతులకు డిజిటల్ పాఠాలు
విద్యార్థుల్లో పూర్థిస్థాయి విషయం పరిజ్ఞానం పెంపొందించాలన్న లక్ష్యంతో డిజిటల్ బోధన చేయాలని ఆలోచించిన ప్రభుత్వం, ‘మన ఊరు.. మన బడి’లో ఆధునీకరించిన పాఠశాలల్లో 8,9,10 తరగతులకు బోధన నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం విద్యాశాఖ ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించింది. ఎంపికైన విద్యాలయంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. 75 అంగుళాల పొడవున్న మూడు డిజిటల్ మానిటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2 కేవీ యూపీఎస్‌లు, ఒక మెటల్ ఫ్రేమ్‌తో కూడిన బోర్డు, పాఠ్యాంశాల బోధనకు సహకరించేందుకు వివిధ విభాగాలకు, కంపెనీలకు సంబంధించిన యాప్‌లు, స్మార్ట్ క్లాస్ రూమ్‌లో నాలుగు ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లు, యూపీఎస్‌లు, గ్రీన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 104 పాఠశాలలు ఎంపిక చేయగా, ఇందులో 80కి పైగా పాఠశాలల్లో డిజిటల్ మానిటర్లు, ప్యానల్ బోర్డులు, గ్రీన్ బోర్డులు అమర్చారు. మిగిలిన పాఠశాలల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తరగతి గదులన్నింటినీ స్మార్ట్ క్లాస్ రూమ్‌లుగా మార్చి వేయనున్నారు. ఈ తరగతి గదుల్లో బోధన చేయడానికి ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
Digital School Jgl
ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు ట్యాబ్‌లు
డిజిటల్ బోధనకు ఎంపికైన పాఠశాలలను మినహాయించి, మిగిలిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణ, మానిటరింగ్ కోసం ప్రభుత్వం ట్యాబ్‌లను అందజేసింది. విద్యా వ్యవస్థను సైతం క్రమంగా డిజిటలైజ్ చేస్తున్న తరుణంలో పాఠశాలలకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో రోజువారీగా స్వీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల ప్రవేశాలు, రోజువారీ అటెండెన్స్, మంత్లీరిటర్న్స్, ఉపాధ్యాయుల హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయుల వివరాలు తదితర విషయాలను మానిటరింగ్ చేయడం కోసం పాఠశాలలకు ట్యాబ్‌లను అందించింది. 160 కంటే లోపు విద్యార్థుల సంఖ్య ఉంటే ఆ పాఠశాలకు ఒక ట్యాబ్, 160 కంటే ఎక్కువ సంఖ్య ఉంటే రెండు ట్యాబ్‌లు అంటే జిల్లాలో పాఠశాలలకు 543 ట్యాబ్‌లను అందజేసింది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం, అడ్వాన్స్ అప్డేట్స్తో కూడిన ట్యాబ్ ఇచ్చారు. వచ్చే నెల 1న ప్రారంభమమ్యే బడిబాట రోజు నుంచే వీటిని హెచ్ఎంలు వినియోగించనున్నారు.
విద్యార్థులకు, పాఠశాల నిర్వహణకు మేలు
ప్రభుత్వం చేపడుతున్న పథకాలు విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాయి. ‘మన ఊరు.. మన బడి’తో పాఠశాలలు రూపురేఖలు మారిపోతున్నాయి. సకల సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా కనిపిస్తున్నాయి. మంచినీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం, డైనింగ్ హాల్స్, రసోయిఘర్లతో కళకళలాడుతున్నాయి. మౌలిక వసతులే కాదు విద్యా బోధన, కరిక్యులమ్ విషయంలోనూ అనేక మార్పులు వచ్చాయి. తాజాగా 8,9,10 తరగతి విద్యార్థులకు డిజిటల్ బోధనను జిల్లాలో ఎంపికైన 104 పాఠశాలల్లో పెద్దపెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి డిజిటల్ బోధన కార్పొరేట్ పాఠశాలల్లోనూ లేదనే చెప్పాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ప్రతి పాఠశాలకు ట్యాబ్ అందజేతతో పాఠశాలల నిర్వహణ సులువుగా మారిపోతుంది.
– డాక్టర్ జగన్మోహన్రెడ్డి, డీఈవో (జగిత్యాల)