ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమైంది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యతో ఆగ్రహ జ్వాల వ్యక్తమైంది. మరి కొందరు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలు తీవ్ర కలకలం రేపగా, కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆ సంస్థ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు. అన్ని డిపోల ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ తీసి శంకర్‌గౌడ్‌కు నివాళులర్పించారు.
కరీంనగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణచౌక్ : నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, ఆర్టీసీ ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనంటూ ఆగ్రహించారు. శుక్రవారం ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల ఎదుట ధర్నాలు చేశారు. ప్రభుత్వంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లోని రెండు డిపోలకు ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో చేరుకొని, కరీంనగర్ డిపో-1 ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్’ ‘మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి’ అంటూ నినదించారు.
మంత్రి వ్యాఖ్యలతోనే ఉద్యోగులు ఆత్మైస్థెర్యం కోల్పోతున్నారంటూ మండిపడ్డారు. వందల మంది బస్టేషన్ ఔట్ గేట్ మీదుగా కూరగాయల మార్కెట్ సమీపంలోని తెలంగాణ అమరుల స్తూపం వరకు వెళ్లారు. అక్కడ నివాళులర్పించి తిరిగి బస్టేషన్‌కు చేరుకుని డిపో-2 ఎదుట మరోసారి నిరసన ప్రదర్శన చేశారు. సమ్మెకు పలు పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించి, మద్దతుగా నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. కోరుట్లలో డిపో ఆవరణ నుంచి కొత్త బస్టాండ్ వరకు ప్లకార్డులతో ర్యాలీ తీశారు. జాతీయ రహదారిపై మానవహారంగా నిలిచి,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోదావరిఖనిలో డిపో కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ తీసి, నివాళులర్పించారు.

Karimnagar
పెద్దల తీరుతోనే ఆత్మహత్యాయత్నాలు : జేఏసీ
నర్సంపేట డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ప్రభుత్వ హత్యేనని జేఏసీ నాయకులు ఎం శంకర్ రెడ్డి, వెంకన్న, ఎం వెంకట రమణారెడ్డి, మనోహర్ మండిపడ్డారు. కరీంనగర్లో వారు మాట్లాడుతూ.. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులను రెచ్చగొట్టేలా ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ కారణంగానే ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని, తాము ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ముందు పెట్టిన 32 డిమాండ్లలో అన్నింటినీ పరిష్కరించాలన్నారు. కాగా, శంకర్ గౌడ్‌కు నివాళులర్పిస్తూ సాయంత్రం ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు.
ప్రయాణికులకు తప్పని తిప్పలు
సమ్మె మూడో రోజుకు చేరుకోవడంతో సామాన్య ప్రయాణికులకు తిప్పలు తప్ప లేదు. కరీంనగర్ రీజియన్ పరిధిలో శుక్రవారం 330 అద్దె, ఎలక్ట్రికల్ బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. కానీ, ఎక్కడా ప్రయాణికులకు సరైన సేవలు అందినట్టు కనిపించ లేదు. కరీంనగర్ బస్టేషన్ నుంచి నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని, వరంగల్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ రూట్లలో.. ఇటు పల్లెవెలుగు బస్సులు పదుల సంఖ్యలో నడిచే జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ రూట్లలో ప్రయాణికులు నరక యాతన పడ్డారు. ఎప్పుడో ఒకటి వచ్చిన బస్సుల్లో కిక్కిరిసి కనిపించారు. 40 నుంచి 50 మంది ప్రయాణించే బస్సుల్లో వంద అంతకు మించి వెళ్లారు.
ఇటు హైదరాబాద్ జేబీఎస్‌కు ఎక్కువగా ఎలక్ట్రికల్ బస్సులను నడిపిన అధికారులు టికెట్లు ఇచ్చేందుకు కండక్టర్లు లేక పోవడంతో డ్రైవర్లకే బాధ్యతలు అప్పగించారు. చాలా మంది డ్రైవర్లకు టిమ్ మిషన్ల ఆపరేటింగ్ రాకపోవడంతో చాలా బస్సుల్లో టికెట్ ఇవ్వలేదని తెలిసింది. ఆర్టీసీ యాజమాన్యం పట్టుదలకు పోయి టికెట్లు ఇవ్వకుండానే బస్సులు నడుపుతున్నదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నదని స్పష్టం చేస్తున్నారు.
వేములవాడలో కండక్టర్‌కు అస్వస్థత
సమ్మెలో భాగంగా వేములవాడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు మౌన ప్రదర్శన చేస్తుండగా, కండక్టర్ రమాదేవి పాల్గొన్నది. అంతలోనే ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయింది. వెంటనే తోటి ఉద్యోగులు అప్రమత్తమై, 108లో ఏరియా దవాఖానకు తరలించారు. మొన్న ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, ఇవాళ కండక్టర్‌కు ఇలా జరిగిందని ఆందోళనకు చెందారు. అయితే ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి ఏరియా దవాఖానకు వెళ్లి రమాదేవిని పరామర్శించారు.
నిలిచిన లాజిస్టిక్ సేవలు
సమ్మె కారణంగా ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు నిలిచిపోయాయి. ఈ నెల 22 అర్ధరాత్రి సమ్మెకు దిగడంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని లాజిస్టిక్ కౌంటర్లలో బుకింగ్‌లు బంద్ అయ్యాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీసీ లాజిస్టిక్ లాభాలతో నడుస్తున్నది. కోట్లాది రూపాయలను ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన లాజిస్టిక్ కేంద్రంలో రోజుకు వెయ్యి పార్సిల్ బుకింగ్ అవుతుండగా, ఈ కౌంటర్ ద్వారా రోజుకు రూ.4లక్షల ఆదాయం లభిస్తున్నది. ప్రస్తుతం సమ్మె కారణంగా బుకింగ్ నిలిచి పోవడంతో మెడికల్, వస్త్ర వాప్యారులు, బుక్ స్టాల్స్. ఇతర వినియోదారులు ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శంకర్‌గౌడ్ మృతికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత
ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు, కార్మికుల హకుల కోసం డ్రైవర్ శంకర్‌గౌడ్ చేసిన ప్రాణత్యాగం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఇది ఆత్మహత్య కాదు, కచ్చితంగా ప్రభుత్వ హత్యే. ఈ ఆత్మహత్యకు రేవంత్ రెడ్డిదే బాధ్యత. తక్షణమే ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. శంకర్‌గౌడ్‌కు నివాళులర్పించడానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి వెళ్తే వారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. తెలంగాణలో రాజ్యంగం ఎక్కడున్నది? అమరుడికి నివాళులర్పించే హక్కు కూడా లేదా..? తెలంగాణాలో నిరకుంశపాలన నడుస్తున్నది. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. తక్షణమే స్పందించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిషరించాలి. లేదంటే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ తరఫున కార్మికులకు అండగా నిలబడుతం.
– సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే
శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు. అది ముమ్మాటీకీ ప్రభుత్వ హత్యే. ఆయన ఆత్మహత్యకు పాల్పడడం ఎంతో బాధాకరం. కార్మికుల సమస్యలను పరిషరించకుండా కాలయాపన చేయడం వల్లే ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా కొట్లాడాలే గానీ, ఇలా ఆత్మహత్యలకు పాల్పడవద్దు. బీఆర్ఎస్ ఎప్పుడూ కార్మికుల పక్షాన అండగా నిలుస్తుంది. నాడు కేసీఆర్ సర్కారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ కీలకమైన జీవో విడుదల చేసింది. ఆ జీవోను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ సర్కారు తీరు వల్లే ఆర్టీసీ ఆర్థికంగా దెబ్బతింటున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలి.
– ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్
రేవంత్ రెడ్డి కండ్లు తెరవాలి
నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లే దుస్థితి రావడం దురదృష్టకరం. ఈ పరిస్థితికి సీఎం రేవంత్ రెడ్డే కారణం. కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చాలా బాధాకరం. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కోటి రూపాయల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ మరణంతోనైనా రేవంత్ రెడ్డి కండ్లు తెరవాలి. చర్చలు కాదు, సమస్యలకు పరిషారం చూపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. బలిదానాలు సమస్యలకు పరిషారం కాదు. కార్మికులు ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడానికి బీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉన్నది. శంకర్ గౌడ్ కుటుంబానికి కార్మికుల పక్షాన కూడా తోడుగా ఉంటాం.
– జగిత్యాలలో కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన అనంతరం విలేకరులతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి