కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 30: విరమణ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పడుతున్నారు. రిటైర్డ్ ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు విరమణ చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 7న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి తెలిపారు.
రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించి, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ఏడాదిన్నరగా ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎనాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ అందలేదని చెప్పారు.
విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ విషయమై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నందున ఈ ధర్నా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె జగదీశ్వర చారి, కోశాధికారి కనపర్తి దివాకర్, తదితరులు పాల్గొన్నారు.