గంగాధర, ఆగస్టు 22: ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానని హామీ ఇస్తివి. గద్దెనెక్కి రెండున్నరేండ్లు దాటిపోయింది. ఇంకెప్పుడు ప్రకటిస్తవ్. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంగారు మాటిచ్చి మరుస్తరా..? ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ధర్నా చేస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తవా..? ఇదేం పద్ధతి’ అంటూ నారాయణపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార 14వ రోజుకు చేరగా, దీక్షలో భాగంగా శనివారం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు.
సమాచారం మేరకు పోలీసులు వచ్చి బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. పోలీసుల తోపులాటలో గ్రామానికి చెందిన సహీనా అనే మహిళ కాలు విరుగగా 108లో కరీంనగర్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. మరో మహిళ సొమ్మసిల్లి పడిపోగా, మధురానగర్ చౌరస్తాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్నా చేస్తున్న నాయకులు, గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేసి రామడుగు ఠాణాకు తరలించారు. ధర్నాకు దిగిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, సీఐ స్థాయి అధికారి గ్రామానికి చెందిన యువకుడిని బూతులు తిట్టాడని గ్రామస్తులు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరితే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆగ్రహించారు.
నారాయణపూర్ రిజర్వాయర్‌తో తాము అష్ట కష్టాలు పడుతున్నామని, ముంపు గ్రామంగా ప్రకటించేదాకా నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ధర్నాకు బీఆర్ఎస్, ఏఐబీఎఫ్, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. గ్రామస్తులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు ధర్నా చేయగా, పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరితే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. ముంపు గ్రామంగా ప్రకటించడంతో పాటు గ్రామస్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.