Talent Test | ధర్మారం, నవంబర్ 3: కరీంనగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రా లో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జీ వర్షిణి విజేతగా నిలిచింది. సదరు విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
కరీంనగర్ లో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంటర్ స్కాలర్షిప్ టెస్ట్ ను ఆదివారం ఆ విద్యా సంస్థల అనుబంధ విద్యాలయాలలో నిర్వహించారు. ఈ టెస్ట్ లో పాల్గొనడానికి ఆ విద్యాసంస్థ ఉమ్మడి జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు లక్కీ కూపన్లు పంపిణీ చేయగా సుమారు 12,500 టెన్త్ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన ఈ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ టెస్ట్ కు హాజరైన విద్యార్థుల పేర్లతో ఆ విద్యాసంస్థ లక్కీ డ్రా నిర్వహించింది. ఈ లక్కీ డ్రా లో ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న జీ వర్షిణి డ్రాలో ప్రథమ విజేతగా నిలిచింది. ఆమెకు ఈ లక్కీ డ్రా లో సుమారు రూ.30 వేల విలువైన ఎల్ఈడి టీవీ ని గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఈ బహుమతిని విజేత అయిన విద్యార్థిని వర్షిణి కి శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి, డైరెక్టర్ నరేందర్ రెడ్డి, డీన్ జగన్మోహన్ రెడ్డి, ఏజీఎం మునీందర్ రెడ్డి అందజేసి అభినందనలు తెలిపారు. కాగా టాలెంట్ టెస్ట్ లక్కీ డ్రా లో ప్రథమ విజేతగా నిలిచిన విద్యార్థిని వర్షిణి ని సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు.