DGP Shivadhar Reddy | గంగాధర, ఏప్రిల్ 17: రోడ్డు ప్రమాదాలు జరిగిన క్రమంలో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం, సంఘటనను గురించి సకాలంలో పోలీసులకు సమాచారం అందించడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు గంగాధర మండలం మధురానగర్ గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు మేడి ప్రసాద్. ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ హైదరాబాద్‌లో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రసాద్‌ను డీజీపీ శివధర్ రెడ్డి శాలువాతో సన్మానించి, ప్రశంసా పత్రం అందజేశారు.
అలాగే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ప్రసాద్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రమాద సమయంలో వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయడం గొప్ప సేవ అని, ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శమని తెలిపారు. మేడి ప్రసాద్ చేసిన సేవలు ఇతరులకు కూడా ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో కూడా ఇదే ఉత్సాహంతో సమాజ సేవ చేయాలని సూచించారు. కాగా తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందజేసిన డీజీపీ శివధర్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.