
Devunipalli Jatara | పెద్దపల్లి రూరల్, నవంబర్ 10 : పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో ప్రతీ యేటా కార్తీకమాసంలో జరిగే శ్రీ లక్ష్మినృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా సోమవారం శ్రీలక్ష్మినృసింహస్వామి రథోత్సవంతో జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఇందుకోసం దేవాలయ కార్యనిర్వహణ అధికారి ముద్దసాని శంకరయ్య ఆద్వర్యంలో దేవాలయ జాతర కమిటీ పాలక వర్గం పర్యవేక్షణలో దేవునిపల్లి జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉదయమే దేవాలయ ఈవో ముద్దసాని శంకరయ్య, జాతర కమిటీ చైర్మన్ బొడ్డుపల్లి సదయ్య, దేవాలయ ప్రదాన పూజారి కొండపాక శ్రీకాంతాచార్యులు ఆద్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
రథోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు సతీమణి పావని, కుమార్తె వైష్ణవి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి జోన్ డీసీపీ కరుణాకర్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా పెద్దపలి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో సీఐలు ప్రవీణ్ కుమార్ , బర్ల అనిల్ కుమార్ పర్యవేక్షణలో పెద్దపల్లి సబ్ డివిజన్ ఎస్ఐలు, పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
జాతర సందర్భంగా పెద్దపల్లి గాయత్రీ డిగ్రీ& పీజీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జాతరలో భక్తులకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరుగడం పట్ల దేవాలయ అధికారులు, పాలక వర్గ కమిటీ సభ్యులు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.