Devi Sharan Navaratri celebrations | ధర్మారం,సెప్టెంబర్ 22: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మాలలు వేసుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ దుర్గా దేవి ఆలయానికి అమ్మవారి దీక్ష చేపట్టడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ నిర్వహకులు, ఉత్స కమిటీ సభ్యులు నూతి విజయలక్ష్మి, నూతి శ్రీదేవి, నూతి శ్రీకరాచారి ఆధ్వర్యంలో ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఇట్టి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో నెలకొల్పారు. ఈ క్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ పూజారి అభిరామ్ అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద భక్తులకు దీక్షలు చేపట్టడానికి మాల ధారణ చేయించారు. అనంతరం భక్తులు ఆలయం గర్భగుడిలో ఉన్న దుర్గాదేవి కి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు.
ఆలయం తరఫున ఆలయ నిర్వాహకులు విజయలక్ష్మి, శ్రీదేవి, శ్రీకరాచారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి జరిగింది. అమ్మవారి దర్శనం కోసం సామాన్య భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కాగా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.