కార్పొరేషన్, ఏప్రిల్ 10: కరీంనగరలో ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 14లోపు సిద్ధం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. నగరం లో చేపడుతున్న తెలంగాణ చౌక్ ఐలాండ్ అభివృద్ధ్ది పనులు, కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మా ణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానేరు నదిపై రూ.224 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. అప్రోచ్ రోడ్డు పనులు, డైనమిక్ లైటింగ్ సిస్టం పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు.
అనుకున్న సమయంలోగా ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత క్రాకర్ షో లు, లెజర్ షో లు, ఫుడ్ ఫెస్టివల్ తో పాటు ఈ బ్రిడ్జికి ఇరువైపులా సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీంతో పాటు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తామని వెల్లడించారు. ఈ రోజుల్లో వివిధ కార్యక్రమాలను కూడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి ఒక పర్యాటక కేంద్రంగా మారుతుందన్నా రు. ఈ బ్రిడ్జిపై రూ.6.50 కోట్లతో చేపట్టిన డైనమిక్ లైటింగ్ పనులు పూర్తవుతున్నాయన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, వచ్చే ఆరు నెలల్లోనే ఈ పనులను పూర్తి చేస్తామన్నారు. నగరంలో రూ.6.50 కోట్ల వ్యయంతో 13 చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తెలంగాణ చౌక్ లో చేపడుతున్న పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. నగరాన్ని రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దుతున్నామని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బరాయుడు, మేయర్ యాదగిరి సునీల్‌రావు కార్పొరేటర్లు వాల రమణారావు, బండారు వేణు, నేతికుంట యాద య్య, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.