జగిత్యాల, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ)/ రాయికల్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే జగిత్యాల అభివృద్ధి సాధ్యమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ, రేవంత్‌రెడ్డి పదకొండు నెలల పాలనలో జగిత్యాలకు జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో ఎంతటి మహత్తును కలిగి ఉందో అందరికీ తెలిసిందేనని, అలాంటి గడ్డపై రైతుల పోరుబాట మరోసారి ప్రారంభమైందన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పాదయాత్రతో ఇక్కడ మరో రైతు ఉద్యమం మొదలైందన్నారు. ఈ పాదయాత్ర సీఎంకు ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు 70 ఎంఎం సినిమా ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి కండ్లు తెరిచి రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే చేపట్టిన రైతు పాదయాత్ర ముగింపు సభ మంగళవారం సాయంత్రం జగిత్యాల కొత్తబస్టాండ్ వద్ద నిర్వహించగా, ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు.
రాష్ట్రంలో ప్రజలు, రైతులు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 వాగ్దానాలు, 420 హామీలను ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. ఒక్క బస్సు తప్ప మిగతా హామీలన్నీ తుస్సేనని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చాడని, రైతు భరోసా, రైతు రుణమాఫీ, వరికి బోనస్, మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. రైతులు అడుగక ముందే 2018 నుంచి 72,815 కోట్ల రైతుబంధు అందించిన ఘనత కేసీఆర్‌దేనని, కరోనా కష్టకాలంలోనూ ఆపలేదని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రైతుబంధు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్న సీఎం మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎకడి నుంచి తెస్తాడని ప్రశ్నించారు. కొనుగోళ్లు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా బోనస్ ఇవ్వకపోగా, ఒక్క గింజకూడా సన్నవడ్లు కొనలేదన్నారు. జగిత్యాల జిల్లాలో వానకాలం సీజన్లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాలని లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి స్థాయిలో మిల్లుల టైఅప్ కూడా చేయలేదన్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్లో కేవలం 30వేల మెట్రిక్ టన్నులే కొన్నదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దళారుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో గతేడాది అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యాన్ని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ‘జగిత్యాలను జిల్లా చేసింది ఎవరు? జిల్లాకు మెడికల్ కాలేజీ తెచ్చింది ఎవరు? జిల్లాలో వేలాది ఇండ్లు కట్టించింది ఎవరు? వరద కాలువను జీవనదిగా మార్చింది ఎవరు? అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. మంచినీటికి సైతం ఇబ్బందిపడ్డ జగిత్యాలకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా రివర్స్ పంపింగ్ చేసి నీటిని ఎత్తిపోసింది కేసీఆర్ అని కొనియాడారు. చెరువులు, కాలువలు నింపి ప్రజలకు తాగు, సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి హయాంలో జగిత్యాలకు జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు.