MLA Kalvakuntla Sanjay | కోరుట్ల, జూలై 9: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని, ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఆధ్యాత్మికతను పెంచి ఆలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కోసం రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నిధుల నుంచి మంజూరు చేసిన రూ.1.50 లక్షల నిధుల ప్రొసీడింగ్ పత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే బుధవారం అందజేశారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బట్టు సునీల్, గేలె గంగాధర్, భూపెల్లి నగేష్, బింగి సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.