Chada Venkat Reddy | చిగురుమామిడి, నవంబర్ 1 : రెండు సంవత్సరాలు కావస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి ఏదని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలు, ఇండ్లు, రోడ్లను శనివారం పరిశీలించారు. అనంతరం చాడ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. రైతన్నను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, అధికారులు కనీస మరో ధైర్యం ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
రేకొండ ఉర చెరువు వద్ద బ్రిడ్జి గత ప్రభుత్వంలో మంజూరు కాగా ఇప్పటివరకు కనీసం పనులు చేపట్టకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇళ్ల నుండి భారీగా వరద నీరు వెళ్లిందన్నారు. ప్రాణస్టం జరిగితే ఎవరి బాధ్యులని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వర్షానికి నష్టపోయిన వరి పంటలకు ఎకరానికి పదివేల రూపాయలు చెల్లిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు.
వర్షానికి కోరిన ఇండ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేకొండలో మృతి చెందిన రైతు పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అన్నారు. చాడ వెంట సింగిల్ విండో డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్ర కోల రాజయ్య, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి బోయిని పటేల్ మాజీ ఎంపీటీసీ పరకాల కొండయ్య, నాయకులు తమ్మిశెట్టి రవీందర్ తదితరులున్నారు.