జగిత్యాల, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాకులు, చెవాకులు పేలొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడుగడుగునా పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది ఇబ్బంది పెట్టినా సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణవాదులు తండోప తండాలుగా వచ్చి కేసీఆర్‌పై ప్రేమతో సభను సక్సెస్ చేశారన్నారు.
సభ అయిపోయిన వెంటనే కేసీఆర్, సభపై కాంగ్రెస్ మంత్రులు తమ అక్కసు వెల్లగక్కారని విమర్శించారు. సభను సక్సెస్ చేసి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పకనే చెప్పారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ధర్మపురి నియోజకవర్గంలోని స్తంభంపల్లి గ్రామంలో 50 ఎకరాల్లో సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలకు మంజూరు చేశామన్నారు.
1009, 09 సర్వే నంబర్లలలో ఈ భూమిని కేటాయించామని, ఎన్నికలు రావడంతో కళాశాల ఏర్పాటుకు అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కళాశాలను ఏర్పాటుకు చొరవ తీసుకోవడం లేదని, మంజూరైన కళాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానకొండూర్ అసెంబ్లీకి తరలించేలా ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇది సరికాదని, కావాలంటే మానకొండూర్‌లో ఇంకో కళాశాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నవోదయ పాఠశాల కూడా నిజామాబాద్ ప్రాంతానికి తరలినట్లు సమాచారం వచ్చిందని, వీటిని తప్పనిసరిగా ధర్మపురి నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసేలా ప్రస్తుత ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, నాయకులు ఆనంద్‌రావు, తుమ్మ గంగాధర్, జలంధర్, మాధవరావు, ఆనందరావు, వొల్లెం మల్లేశం, వెంకటేశ్వర్రావు, గంగారెడ్డి, రిజ్వాన్, ప్రతాప్, సన్నిత్రావు, ప్రణయ్ పాల్గొన్నారు.