DEO Madhavi | ధర్మారం, జూన్ 23 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి మాధవి తనిఖీ చేశారు. ధర్మారంలోని బ్రిలియంట్ కిడ్జి పాఠశాలను సందర్శించి పలు రికార్డులను ఆమె ఈ సందర్భంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన పాఠశాల పత్రాలను ఆమె తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించి విద్యా బోధన విధానాలను, ఎఫ్ఎల్ఎన్ నిర్వహణ తీరు, ఏకరూప దుస్తులుపాఠ్యపుస్తకాల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి నమోదు చేసుకున్నారు. విద్యార్థులను పరీక్షించారు. నల్లలింగయ్యపల్లి ప్రాథమిక పాఠశాలను డీఈవో సందర్శించగా ఆ పాఠశాల విద్యార్థులు ఆలపించిన అభినయ గీతాలను, వర్ణమాల తోరణాలను చూసి ఉపాధ్యాయులను ఆమె ప్రశంసించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. పిల్లలతో తప్పకుండా కథల పుస్తకాలు చదివించాలని లైబ్రరీ పీరియడ్ అన్ని పాఠశాలలో తప్పక నిర్వహించాలని ఆమె సూచించారు .బాగా చదివే పిల్లలను వెనుకబడిన పిల్లలతో కలిపి గ్రూపులుగా విభజించి చదివించాలని సూచించారు. ఆమె వెంట విద్యాధికారి పి. ప్రభాకర్, సీఆర్పీలు కె. కవిత, బి. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.