ధర్మారం, మే20: ధర్మపురి నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తున్నదని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ధర్మారం మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించి, ప్రెస్మీట్ పెట్టేందుకు తమ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌరస్తాకు వస్తుంటే కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించడాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ర్టాన్ని బీఆర్ఎస్ పదేండ్లపాలనలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. నిజంగా ఆ పార్టీ నాయకులకు నీతి, నిజాయితీ ఉంటే, ప్రజలు, తమ పార్టీ నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ధర్మపురి ఎమ్మెల్యేగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని, తట్టెడు మట్టి తీయలేదని ఆరోపించారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర పైసలు లేవని, తనను కోసినా ఒక్క పైసా రాదని అన్నాడని, దీనిని బట్టే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థమైతున్నదని చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో ఏడాదిన్నరలో ఏం సాధించారో, ఏం పనులు చేశారో చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఎందుకు రెచ్చిపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు అమలు చేయకుండా, ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులపై దాడులకు దిగడం మంచి పద్ధతికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలను ఎవరూ క్షమించరని, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేయలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఎంత అభివృద్ధి చేస్తారో చేసి చూపించాలే కానీ, ఇలా భౌతిక దాడులకు ఉసిగొల్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతానంటే సహించేది లేదని హెచ్చరించారు.