నాలుగున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి జిల్లా కళాకారులు చందాలు పోగు చేసుకుని నిర్మించుకున్న భవనం అది. మేటి కళాకారులెందరో ప్రదర్శనలు ఇచ్చి పోగు చేసిన సొమ్ముతో నిర్మించుకున్న కళల సౌధమిది. ఎందరో కళాకారులకు పురుడోసిన సాంస్కతిక వేదిక అది. అధికార యంత్రాంగం తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆ పుట్టినిల్లు నేల మట్టమైంది. కళలను కాపాడేందుకు ఆనాటి అధికారులు ప్రోత్సహిస్తే, ఇప్పుడు ఆ కళామ తల్లి గుండెలపై బుల్డోజర్లు దించిన ఘనత ఈ నాటి అధికారులకే దక్కుతుందని ఉమ్మడి జిల్లా కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లోని త్యాగరాజ లలిత కళా పరిషత్తు భవనం కూల్చివేతపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 47 ఏండ్ల కింద నిర్మించిన ఈ భవనం ఎందరో కళాకారులను ప్రోత్సహించి, సాంస్కృతిక రంగంలో నిలబెట్టిందని చెబుతున్న కళాకారులు, కూల్చిన చోటనే కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్, మే 25(నమస్తే తెలంగాణ) : కరీంనగర్‌లోని త్యాగరాజ లలిత కళా పరిషత్తుకు పెద్ద చరిత్రనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1976 నవంబర్ 1 నుంచి 20 వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు కరీంనగర్ జిల్లా వేదికైంది. అప్పటి కలెక్టర్ జీపీ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. నాటకాలు, జానపదాలు, ఇతర కళా రూపాలన్నీ ఒకే వేదికను పంచుకున్నాయి. అప్పటి నుంచి కరీంనగర్‌లోని కళాకారులు చాలా మంది వెలుగులోకి వచ్చారు. ఎంతో ఉత్సాహంతో వివిధ కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న కళాకారులను మరింత ప్రోత్సహించేందుకు ఒక వేదిక కావాలని జిల్లాలో ఉండే నాటక సమాజం ఆలోచించింది. అందులో భాగంగా 1980లో కళాసదస్సును ఏర్పాటు చేసింది.
ఈ సదస్సు ఏర్పడిన తర్వాత ప్రతినెలా నాటక ప్రదర్శనలు నిర్వహించే వారు. జిల్లా కలెక్టర్లు సహా కళలను ప్రోత్సహించే ప్రతి అధికా రి ఈ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనేవారు. ఈ క్రమంలో కేఎస్ శర్మ కలెక్టర్‌గా ఉన్న సమయంలో కళారంగాన్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో, నాటక రంగం బతికి ఉండాలంటే ఒక నిర్ధిష్టమైన ఆదాయం ఉండాలని తలచారు. అందులో భాగంగానే కరీంనగర్ వన్‌టౌన్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. 1980లోనే ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిన కళాకారులు, కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ప్రముఖ నటులు జేవీ సోమయాజులు, రమణ వంటి ప్రముఖ సినీ కళాకారులతో కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి ప్రముఖ గాయకురాలితోకూడా ప్రదర్శనలు ఇప్పించారు. ఈ కార్యక్రమాలకు టికెట్లు కేటాయించగా కొంత ఆదాయం వచ్చింది. కొందరు దాతలు కూడా చందాల రూపంలో ఆర్థికంగా సహకరించారు. అలా రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకుని త్యాగరాజ లలిత కళా పరిషత్తుగా నామకరణం చేసుకున్నారు.
త్యాగరాజ లలిత కళా పరిషత్తు ఏర్పాటు తర్వాత కొంత కాలం ఈ భవనం కళలకు వేదికగా మారింది. నాటకాలు రిహార్సల్ చేసుకునేందుకు ఎందరికో ఉపయోగపడింది. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కళా పరిషత్తుకు ఎవరు కలెక్టర్ ఉంటే వారే చైర్మన్‌గా వ్యవహరించే వారు. అయితే, భవనాన్ని అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయంతో కళలను మరింత ప్రోత్సహించ వచ్చని కళాకారులు, అధికారులు భావించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా హౌసింగ్ బోర్డులకు అద్దెకు ఇచ్చారు. చాలా కాలం ఈ రెండు ప్రభుత్వ కార్యాలయాలు ఇదే భవనంలో నిర్వహించబడ్డాయి. 1990లో ఐవీ సుబ్బారావు కలెక్టర్‌గా ఉన్నపుడు ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడి నుంచి ఖాళీ చేయించారు.
ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇస్తూ వచ్చే ఆదాయంతో కొంత కాలం కళాకారులకు మంచి ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత ఏ మైందో ఏమోగాని దీని ఉద్దేశం క్రమంగా గాడి తప్పింది. కళలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఆశయం మసకబారింది. సుమిత్రా డావ్రా కలెక్టర్‌గా ఉన్నపుడు ఈ పరిషత్తు గురించి కొంత శ్రద్ధ తీసుకున్నారు. అధికారుల చేతి నుంచి తప్పించి శాశ్వత కేర్ టేకర్లను నియమించారు. త్యాగరాజ లలిత కళాపరిషత్తును ఉమ్మడి జిల్లా నుంచి కొందరు కళాకారులు శాశ్వత సభ్యులుగా ఉండి నిర్వహిస్తూ వచ్చారు. కేఎస్ శర్మ కలెక్టర్‌గా ఉన్నపుడు ఏ ఉద్దేశంతోనైతే ఈ కళా పరిషత్తును ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశంతో పాటు ఇపుడు భవనం కుప్ప కూలింది
జిల్లా నుంచి గొప్ప గొప్ప కళాకారులను తయారు చేసిన త్యాగరాజ లలిత కళా పరిషత్తు భవనం ఇపుడు కుప్ప కూలింది. ఈ స్థలాన్ని మరో సంస్థకు అప్పగించే ఉద్దేశంలో అధికారులు భవనాన్ని కూల్చి వేసినట్లు కళాకారులు వాపోతున్నారు. కళా పరిషత్తు కమిటీకి గానీ, శాశ్వత సభ్యులుగా ఉన్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భవనాన్ని కూల్చి వేశారని వారు వాపోతున్నారు. 47 ఏండ్ల కింద ఏర్పడిన ఈ కళా పరిషత్తుకు అప్పటి కలెక్టర్ స్థలం కేటాయిస్తే అందులో చందాలు పోగు చేసి భవనాన్ని నిర్మించుకున్నామని, ఈ భవనాన్ని కూల్చి వేయడం అన్యాయమని అంటున్నారు.
ఒక కళా సంస్థకు ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఏక పక్షంగా మరో సంస్థకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. కళా సంస్థలు, సమాఖ్యలు కలిసి నిర్మించుకున్న ఈ భవనం ప్రభుత్వానిది కాదని, ఒక రిజిష్టర్ కల్చరల్ సొసైటీకి సంబంధించినదని స్పష్టం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ శర్మ, నాటక, టీవీ, సినిమా నటులు కేతిరెడ్డి మల్లారెడ్డి, గుండ మల్లయ్య, కేతిరి సుధాకర్ రెడ్డి, పెద్దపల్లి రాజేంద్ర ప్రసాద్, పంజాల రాంనారాయణ తదితరులు అధికారుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. కూల్చిన చోటనే నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎందరెందరో గొప్ప కళాకారులను తీర్చిదిద్దిన త్యాగరాజ లలిత కళా పరిషత్తు భవనం ఇప్పటికే నేలమట్టమైంది. నిజానికి నిర్వహణ లేక పోవడంతో భవనం శిథిలావస్థకు చేరింది. పది రోజులుగా ఈ భవనాన్ని అధికారులు కూల్చి వేస్తున్నారు. ఈ స్థలంలో మరో ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని కళాకారులు ఆరోపిస్తున్నారు. కొందరు కింది స్థాయి అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ భవనం ప్రభుత్వ నిధులతో నిర్మించినది కాదని, అప్పట్లో అన్ని సంస్థలకు కేటాయించినట్లే కేవలం స్థలం మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని కళాకారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో త్యాగరాజ లలిత కళా పరిషత్తు భవనాన్ని తిరిగి ఇదే స్థలంలో నిర్మించాలని, అంతే కాకుండా అంతరించి పోతున్న కళలు ప్రతిబింబించే విధంగా ఒక కల్చరల్ మ్యూజియం, ఆర్ట్ గాలరీని, కళాకారులకు వసతి గృహాన్ని ఇక్కడే నిర్మించాలని కళాకారులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా జిల్లా స్థాయిలో సమస్య పరిష్కారంకాకుంటే రాష్ట్ర స్థాయిలో సమస్యను లేవనెత్తేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ప్రముఖ నటులు కేతిరెడ్డి మల్లారెడ్డి, గుండా మల్లయ్య తదితరులు స్పష్టం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి ఎందరో కళాకారులను తయారు చేసి, ఎన్నో కళారూపాలను ప్రోత్సహించిన త్యాగరాజ లలిత కళా పరిషత్తు భవనం నేల కూల్చడం అన్యాయం. అధికారులు తీసుకున్న ఈ చర్చ కళాకారులను కలిచి వేసింది. పరిషత్తు కేర్ టేకర్లుగా ఉన్న తమను విచారించకుండానే అధికారులు కూల్చి వేత నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులకు అందిన తప్పుడు సమాచారంతోనే ఇలా జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ భవన నిర్మాణానికి ఎలాంటి ప్రభుత్వ నిధులు వినియోగించ లేదు. కళాకారులు సేకరించుకున్న చందాలతోనే నిర్మాణం జరిగింది. ఈ స్థలాన్ని మరో సంస్థకు కేటాయించ రాదు. కూల్చిన చోటనే తిరిగి నిర్మించాలి. ఒక కల్చరల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి. అంతే కాకుండా కళాకారుల, సాహితీ మిత్రుల సమావేశాలకు అనువైన హాల్‌తోపాటు వసతి గృహాన్ని నిర్మించాలి. లేదంటే ఆందోళనలు తప్పవు.
– వైఎస్ శర్మ, తెలంగాణ రాష్ట్ర సాంసృ్కతిక సంస్ధల కళాకారుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు
త్యాగరాజ లలిత కళా పరిషత్తును కూల్చివేసే నిర్ణయం తీసుకోవడంలో పెద్ద తప్పు జరిగింది. అధికారులకు అందిన తప్పుడు సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నా. ఎందరో కళాకారులను తయారు చేసిన సంస్థ ఇది. ఒకప్పుడు నేను కూడా ఇక్కడే రిహార్సల్స్‌లో పాల్గొనేవాన్ని. కళాకారుల చమటతో నిర్మించుకున్న భవనాన్ని వారికి చెప్పకుండా ఎలా డిస్మెంటల్ చేస్తారు.? కేఎస్ శర్మ కలెక్టర్‌గా ఉన్నపుడు నిర్మించిన భవనం ఇది. ఈ భవనంపై వచ్చిన అద్దెతో నాటకాలు, ఇతర కళల ప్రదర్శన చేసే వాళ్లం. పేద కళాకారులకు కూడా పెన్షన్ ఇచ్చే వాళ్లం. అప్పట్లో ఆక్టివ్‌గా ఉన్న వాళ్లంతా సినిమాలు, టీవీ సీరియల్స్ ఆర్టిస్టులుగా ఎదిగారు. ఇపుడు దీనిని పట్టించుకునే వారు లేక పోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కూల్చిన చోటనే తిరిగి భవనాన్ని నిర్మించి కళాకారులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. లేదంటే రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించాల్సి వస్తోంది.
– కేతిరెడ్డి మల్లారెడ్డి, ప్రముఖ సినీ, సీరియల్స్ ఆర్టిస్టు
త్యాగరాజ లలిత కళా పరిషత్తు లాంటి భవనం ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కడా లేకుండే. అప్పట్లో దీనిని ఎంతో శ్రమించి నిర్మించుకున్నం. అప్పటి కలెక్టర్ కేఎస్ శర్మ స్థలాన్ని కేటాయించారు తప్పా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇవ్వ లేదు. ఈ భవనం కళాకారుల శ్రమ. అది మా కళాకారులకే చెందాలి. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళా పరిషత్తు నిధులు కూడా అధికారుల చేతిలోనే ఉండేవి. కొంత కాలం తర్వాత కమిటీ ఏర్పాటు చేసుకుని నిర్వహించుకున్నం. ఇపుడు ఆ పరిస్థితి లేదు. కళలకు పుట్టిల్లుగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఇది చెరగని చిహ్నంగా ఉండేది. ఇంతటి భవనాన్ని కూల్చి వేయడం తీవ్రంగా కలిచి వేస్తోంది. ఇప్పుడు ఇక్కడే భవనాన్ని పునర్నిర్మాణం చేపట్టాలి. కళాకారుల సొత్తు కళాకారులకే దక్కాలి.
– గుండా మల్లయ్య, ప్రముఖ నాటక, టీవీ, సినీ నటుడు
త్యాగరాజ లలిత కళా పరిషత్తు కళలకు పు ట్టిల్లు లాంటిది. ఈ భవనంలో మొట్ట మొ దట రిహార్సల్ చేయించింది నేనే. ఒకప్పు డు ఈ భవనంలోనే రిహర్సల్ చేసుకుని నంది నాటక పోటీలకు వెళ్లాం. ఎంతో గొ ప్పగా నాటకాలు ప్రదర్శించే వాళ్లం. సంస్థ తరపున నాటక పోటీలు కూడా నిర్వహించే వాళ్లం. కళలు అంతరించి పోతున్న క్రమంలో ఈ కళా పరిషత్తును కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ కూల్చి వేత నిర్ణయం సరైనది కాదు. ఒకప్పటికి జ్ఞాపకార్థానికైనా దీనికి మరమ్మతులు చేసి ఉంచాల్సింది. కళలకు ప్రతిరూపంగా మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తే బాగుండేది.
– రాజేంద్ర ప్రసాద్, నాటక కళాకారుడు
త్యాగరాజ లలిత కళా పరిషత్తుకు ఒకప్పుడు ఎంతో గొప్ప పేరు ఉండేది. కళాకారులను ప్రోత్సహించే వారు లేక కళలు కనుమరుగైన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్లో ఈ కళా క్షేత్రం కళలకు నిదర్శనంగా ఉండేది. ఈ భవనాన్ని కూల్చివేసి కళలకు వేదికనేది లేకుండా చేశారు. జ్ఞాపక చిహ్నాన్ని చెరిపేశారు. ఇది చాలా దురదృష్టకరం. ఏ ప్రభుత్వమైనా ఉన్నదానిని కాపాడుకోవాలని చూస్తుంది. కరీంనగర్లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఇప్పటికైనా దీనిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ప్రాచీన కళలను ప్రదర్శించే విధంగా, మరుగున పడిన కళలను ప్రోత్సహించాలన్నా, వారసత్వ సంస్కృతిని కాపాడుకోవాలన్నా ఇలాంటి క్షేత్రాలు అవసరం.
– సౌదాల ప్రభాకర్, కళాకారుడు