సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 12: బీడీ కార్మికులు కదం తొక్కారు. చేయూత పథకం కింద ప్రతి నెలా 4వేలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుక్రవారం రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల రాములు మాట్లాడుతూ, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందిన బీడీ పరిశ్రమ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి చూపుతున్నదని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు, జీఎస్టీ, అనేక ఆంక్షలను విధింపుతో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదన్నారు.
చేతినిండా పని లేక, సరైన వేతనాలు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా 4వేలు ఇస్తామన్న హామీ ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని ప్రశ్నించారు. చేయూత పథకాన్ని వెంటనే వర్తింపజేయాలని, బీడీ కార్మికులతోపాటు ప్యాకర్స్, ఛాటర్స్, నెలసరి ఉద్యోగులకూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, విరమణ పొందిన వారికి కనీసం 10 వేలు పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. ఇక్కడ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ భూమేశ్వర్, గౌరవాధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ సూర్యశివాజీ, జిల్లా అధ్యక్షురాలు మందడి మణెవ్వ, జిల్లా కార్యదర్శి వేముల పర్శరాములు, సిద్దిపేట జిల్లా నాయకుడు తడక లచ్చయ్య, పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు రవితేజ, కొయ్య రాకేశ్, సోను, అశోక్, పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.