కరీంనగర్ కమాన్‌చౌరస్తా, మే 7 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేశ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలుపగా, కళాశాలల యాజమాన్యాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలయ్యే వరకు పరీక్షలు నిర్వహించేది లేదని గతంలో శాతవాహన ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ (సుప్మా) నాయకులు వీసీకి వినతి పత్రం అందజేశారు.
ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు ఒకే తాటిపైకి వచ్చి కొన్ని వాయిదాల తర్వాత డిగ్రీ పరీక్షల నిర్వహణ ఈ నెల 14 నుంచి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ విషయంలో యాజమాన్యాలపై విద్యార్థులతో ఒత్తిడి తెప్పించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి, పోలీసుల పహారా మధ్య అయినా పరీక్షలు రాసేలా చేస్తామంటూ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం దాదాపు రెండేళ్లుగా డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. బకాయిలు విడుదల కాకపోవడంతో తాము అప్పులు తీసుకువచ్చి మరీ కళాశాలల నిర్వహణ చేపట్టాల్సిన పరిస్థితి ఉన్నదని, అధ్యాపకులకు వేతనాలు, భవనాలకు అద్దెలు, ఇతర నిర్వహణ భారం తట్టుకోలేక పోతున్నామని ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకునే వారు లేక పోయారు. గతంలో ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మంత్రి ప్రత్యేక చర్యలతో 10 శాతంలోపు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత నెలనెలా కొన్ని నిధులు కేటాయిస్తామని యాజమాన్యాల సంఘాలకు హామీ ఇచ్చింది.
ఆ మాట ప్రభుత్వం దాటవేయడయంతో యాజమాన్యాలు ప్రస్తుతం తమకు నిధులు విడుదల చేసే వరకు పరీక్షలు నిర్వహించేది లేదంటూ స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినా యాజమాన్యాలు యూనివర్సిటీకి చెల్లించలేదు. ఇదే విషయంపై శాతవాహన యూనివర్సిటీలో సైతం మంగళవారం యూనిర్సిటీ అధికారులు, శాతవాహన ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్, మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో చర్చలు జరిగినా అవి కొలిక్కిరాలేదు.
ప్రభుత్వం రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడంతో యాజమాన్యాలు పరీక్షలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకైనా పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు పీజీ ప్రవేశ పరీక్షలు జూన్‌లో ఉంటాయి. అప్పటి వరకు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు పూర్తికాపోతే విద్యార్థులు చికుల్లో పడతారు. ఈ విషయంపై యూనివర్సిటీలు, యాజమాన్యాలు ఒక్క తాటిపైకి వచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలి.
– కాంపెల్లి అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు (కరీంనగర్)
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలచేయక పోవడంతో డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలవుతాయని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పదించకుంటే విద్యార్థులు పరీక్షల్లో వెనునకబడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజ్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి.
– సిరిశెట్టి రాజేశ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం