జగిత్యాల : పదవి పోతుందనే భయంతోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు (Defection MLAs) అబద్దాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్( BRS ) జగిత్యాల జిల్లా నాయకురాలు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ (Dava Vasantha Suresh) ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అనర్హత నీడలో, అంతులేని భయంతో, అబద్దాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలం గడుపుతున్నారని విమర్శించారు. నిజం ఎప్పటికి దాగదు. ఎన్నటికో ఒకనాడు పాపం పండక తప్పదని పేర్కొన్నారు.
పదవి గండం రాగానే బీఆర్ఎస్లో ఉన్నామని బుకాయిస్తున్నారని, పార్టీ మారి ప్రజలకు చేసిన సంక్షేమమేంటో, ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో, తెచ్చిన నిధులు ఎన్నో శ్వేత పత్రం( White Paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచించి, నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల చోరీ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమాధానం చెప్పాలని కోరారు.
రాజ్యాంగం పట్టుకొని ప్రజాస్వామ్యం అంటూ రాహుల్ గాంధీ దేశంలో తిరగడం కాదు. తెలంగాణలో తిరగాలని సూచించారు. రాజీవ్ గాంధీ ఆకాంక్షలకు రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తుంటే సోనియా, రాహుల్ మౌనం వహించడం దుర్మార్గమని పేర్కొన్నారు. గాంధీలా పార్టీలో గాడ్సే లాగ రేవంత్ రెడ్డి పాలన ఉందని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తన నైతికత, చిత్తశుద్ధిని కాపాడుకోవాలని కోరారు. కరీంనగర్ సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని నిలాదీస్తే తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని అన్నారని గుర్తు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై అత్యున్నత న్యాయస్థానం సరైన తీర్పును ఇస్తుందని భావిస్తున్నట్లు దావ వసంత వెల్లడించారు. ప్రజా క్షేత్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో జగిత్యాల రూరల్ అర్బన్ , రాయికల్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, బర్కం మల్లేష్, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, సీనియర్ నాయకులు సాగి సత్యం రావు, ఐయిల్నేని వెంకటేశ్వర్ రావు, చింత గంగాధర్, ప్రసాద్, మాజీ సర్పంచులు బుర్ర ప్రవీణ్ గౌడ్, ఎల్లా రాజన్న, గంగారం, లక్ష్మణ్ రావు , నక్క గంగాధర్, కిషోర్, అనంతుల గంగారెడ్డి, అనురాధ, సాగర్ రావు, హరీష్ , సన్నిత్ రావు, గాజుల శ్రీనివాస్, జూనెద్, గంగిపిల్లి వేణు మాధవ్, ప్రణయ్, భగవాన్ పాల్గొన్నారు.