Dharmaram PACS | ధర్మారం, మే 25 : వ్యవసాయ పరపతి సహకార సంఘం పదవి అవకాశం ఉన్నంతవరకు రైతుల సేవకి పునరంకితం అవుతానని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి అన్నారు. మళ్లీ వచ్చిన అవకాశంతో రైతుల సేవే పరమావధిగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. నంది మేడారం సింగిల్ విండో కార్యాలయంలో మంగళవారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి తోటి డైరెక్టర్లతో కలిసి పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. వివరాలలోకి వెలితే… గతంలోనే సింగిల్ విండో పాలకవర్గాల గడువు 14.2.2025లో ముగిసి పోయిన అనంతరం 24.2.2025 న రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గాల గడువును 6 నెలలు పొడిగించింది. మొదటిసారి ఇచ్చిన గడువు ముగియడంతో 3.9.2025న మరో 6 నెలలు గడువును పొడిగిస్తూ 2వ సారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడువు ముగియకముందే అర్ధాంతరంగ ప్రభుత్వం పాలకవర్గాలను 19.12.2025 రద్దు చేసింది.
పాలకవర్గాల పొడిగింపుపై హైకోర్టు దాకా వెల్లింది. పాలకవర్గాలను తిరిగి యధావిధిగా కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్యాక్స్ చైర్మన్లు పర్సన్ ఇన్ చార్జీలుగా బాధ్యతలు స్వీకరించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ మేరకు సింగిల్ విండో కార్యాలయంలో విండో సీఈవో మల్లేశం సమక్షంలో ప్యాక్స్ చైర్మన్ పలువురు డైరెక్టర్లు సమక్షంలో బలరాం రెడ్డి పర్సన్ ఇన్ చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ మల్లేశం బలరాం రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం పలువురు డైరెక్టర్లను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా బలరాం రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టడం ఆనందదాయకంగా ఉందని అన్నారు.
సింగిల్ విండో పాలకవర్గం గడువు ఉన్నంతవరకు రైతులకు అండదండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా జరిగే విధంగా కృషి చేస్తామని అన్నారు. కేంద్రాలలో ఏవైనా సమస్యలు ఉంటే తనకు రైతులు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సామంతుల రాయమల్లు, డైరెక్టర్స్ మోర కొమురయ్య, దీటి శ్రీనివాస్, సాయిరి కుమార్, పాలమాకుల తిరుపతి రెడ్డి, ఈదుల శివకుమార్ రెడ్డి, ఇస్లావత్ రూపానాయక్, సింగిల్విండో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.