గంగాధర, ఏప్రిల్ 6: గంగాధర మండలంలో ప్రొటోకాల్ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ప్రొటోకాల్ పాటించలేదంటూ రెవెన్యూ అధికారులు బూరుగుపల్లి రేషన్ డీలర్‌ను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించి ఇతరులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిచ్చింది.
ఈ నెల 2న మంగపేట గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన తర్వాతే అన్ని గ్రామాల్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పినా బూరుగుపల్లి డీలర్ సరోజ ప్రొటోకాల్ పాటించకుండా ముందే బియ్యం పంపిణీ చేసిందని తహసీల్దార్ అనుపమ మూడు రోజుల క్రితం ఆమెను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. స్థానిక మహిళా సంఘానికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
ఆదేశాలుంటేనే పంపిణీ చేశాం
ఈ నెల 1న సన్న బియ్యం పంపిణీ చేయాలని తమకు ఆదేశాలు ఉన్నాయని, అందుకే పంపిణీ చేశానని డీలర్ సరోజ చెబుతున్నారు. అయితే ఉదయం 11:14 గంటలకు బియ్యం పంపిణీ నిలిపివేయాలని డిప్యూటీ తహసీల్దార్ తమ గ్రూపులో మెస్సేజ్ పెట్టడంతో ఆపివేశానని, కానీ అప్పటికే చాలా మంది బియ్యం తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
కాగా, సన్నబియ్యం పంపిణీ సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించకపోవడంతో వారి ఒత్తిడి మేరకే తనను విధుల నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. గ్రామంలో మూడు రోజుల క్రితం ఆర్ఐ విచారణ చేసి, ఇచ్చిన నోటీసులో కూడా తాను ఏ తప్పు చేశానో పేర్కొనలేదని, అడిగితే తహసీల్ కార్యాలయానికి రావాలని చెప్పారని ఆరోపించారు. 1న తానే కాదు మండలంలో 25 మంది రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేశారని, కానీ, తన భర్త గడ్డం స్వామి బీఆర్ఎస్ కార్యకర్త కావడంతోనే స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో ప్రొటోకాల్ సాకుతో రెవెన్యూ అధికారులు తనను డీలర్ బాధ్యతల నుంచి తొలగించారని సరోజ ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, ఈ విషయమై తహసీల్దార్ అనుపమను వివరణ కోరగా.. ఈ నెల 2న ఎమ్మెల్యే సత్యం అధికారికంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాతే అన్ని గ్రామాల్లో బియ్యం పంపిణీ చేయాలని చెప్పినా ప్రొటోకాల్ పాటించకుండా ఇద్దరు రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేయడంతో వారిని తాత్కాలికంగా తొలగించి ఇతరులకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు.