రాంనగర్, జూన్ 2: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న మంగళవారం కౌంటింగ్ కేంద్రం (ఎస్సారార్ కాలేజీ) ఎదుట గల రోడ్డుపై నుంచి వాహనాలను అనుమతించబోమని కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఒకప్రకటలో తెలిపారు. జగిత్యాల నుంచి కరీంనగర్‌కు వచ్చే వాహనాలు రేకుర్తి చౌరస్తా వద్ద నుంచి శాతవాహన యూనివర్సిటీ, పద్మనగర్ మీదుగా నగరంలోకి చేరుకోవాలని, కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లే వాహనాలు కోర్ట్ కాంప్లెక్స్ దాటగానే జ్యోతినగర్, కెమిస్ట్రీ భవన్, శాతవాహన యూనివర్సిటీ, రేకుర్తి చౌరస్తా వద్ద జగిత్యాల రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు.
బ్యాంకు కాలనీలో గల డీ మార్ట్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలు బ్యాంకు కాలనీ రోడ్డు నంబర్ వన్ మీదుగా స్థానిక స్పెన్సర్స్ వద్ద గల రోడ్డు నుంచి నగరంలోకి వెళ్లాలన్నారు. స్పెన్సర్ నుంచి ఆర్టీసీ వర్‌షాప్, ఇటు డీ మార్ట్ వరకు స్టెరైల్ జోన్‌గా నిర్ణయించారని ఇక్కడ ఎలాంటి వాహనాలు తిరగడానికి అనుమతిలేదని వెల్లడించారు. అలాగే, కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 వరకు, ఒకవేళ రీ-కౌంటిగ్ జరిగితే అవికూడా ముగిసేవరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడవద్దని తెలిపారు. ఏదేని ప్రత్యేక పరిస్థితుల్లో పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.