ఏసీబీ వలలో భారీ తిమింగళమే పడింది. లంచం డిమాండ్ చేసి అడ్డంగా చిక్కింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన 64 లక్షల కమీషన్ చెల్లించేందుకు మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్రావు ఏకంగా 15 లక్షల లంచం డిమాండ్ చేశాడు. తప్పని పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఆ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం బాధితుడి నుంచి లక్ష తీసుకుంటుండగా మేనేజర్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ సుధగోని కుమారస్వామిని పట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు.
కరీంనగర్ రాంనగర్, జూలై 4 : ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు డీసీఎంఎస్ అనుసంధానంతో తన గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాడు. 2018 నుంచి వడ్లు కొనుగోలు చేసిన రాజు, సివిల్ సప్లయి అధికారులు చెప్పిన చోటుకు ఎప్పటికప్పుడు పంపించాడు. వీటికి సంబంధించి 2018 నుంచి వడ్ల కొనుగోలు కమీషన్ 90,16,650 డీసీఎంఎస్ నుంచి రాజుకు రావాల్సి ఉన్నది. అప్పటి నుంచి డీసీఎంఎస్ ఆఫీస్ చుట్టూ తిరిగినా మేనేజర్ వెంకటేశ్వర్రావు డబ్బులు చెల్లించలేదు.
డబ్బులు ఇవ్వడం కుదరదని ఎరువుల బస్తాలు పంపిస్తామని సలహా ఇచ్చాడు. ఎరువుల బస్తాలకు కమీషన్ వస్తుందని ఆశతో సుమారు 26 లక్షల విలువైన ఎరువులు కొద్ది రోజుల క్రితం పంపించాడు. దీనికి కూడా 13 శాతం కమీషన్ వెంకటేశ్వర్రావే తీసుకున్నాడు. రాజు తనకు రావాల్సిన మిగతా 64లక్షల కమీషన్ డబ్బుల కోసం తిరుగుతున్నా మేనేజర్ డబ్బులు ఇవ్వడం కుదరని, డబ్బుల కింద మరో 15 లోడ్ల ఎరువుల బస్తాలు పంపిస్తానని చెప్పాడు.
దీంతో చేసేదేమీ లేక ఎరువుల బస్తాలు తీసుకునేందుకు రాజు అంగీకరించగా, ఒక్కో లోడ్‌కు లక్ష నగదు ఇస్తేనే పంపిస్తానని షరతు విధించాడు. వెంకటేశ్వర్రావు బాధ భరించలేక రాజు ఈనెల ఒకటిన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నిఘా వేశారు. గురువారం మేనేజర్ వెంకటేశ్వర్రావు, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి తమ కార్యాలయంలోని ఛాంబర్లో డబ్బు లు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నా రు.
లంచం డబ్బును స్వాధీనం చేసుకుని రసాయనిక పరీక్షలు నిర్వహించగా లంచం తీసుకున్నది వాస్తవం కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని సిబ్బందిని విచారించి, రికార్డులను పరిశీలించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరిని విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు.