జగిత్యాల, జనవరి 13 : జగిత్యాల అభివృద్ధికి, ఎమ్మె ల్యే సంజయ్ కుమార్‌కు ఎలాంటి సంబంధమూ లేదని, ఆయనో షాడో కాంట్రాక్టర్ అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. ఆయన పైసల కోసం, సొంత పనుల కోసం పార్టీ మారిండని, రాజకీయ భిక్ష పెట్టిన కవితనే వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. ఈ ఎమ్మెల్యే ఇంకా కార్యకర్తలకు ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించాలని కోరారు. కౌశిక్ రెడ్డిపై ఉద్దేశ పూర్వకంగా మూడు కేసులు పెట్టారని, ఇక ప్రజాపాలన ఎకడ ఉందని, ఇక్కడ నడిచేది రౌడీ పాలన అని ఎద్దే వా చేశారు. సంజయ్‌కు జగిత్యాల ప్రజల పక్షాన సవాల్ చేస్తున్నామని, మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ గెలిచి మాట్లాడాలని చాలెంజ్ విసిరారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఏ పదవి లేనప్పుడే బీఆర్ఎస్లోకి వచ్చారని, మీ లెక ఇకడ గెలిచి పార్టీ మారలేదని, డబ్బులకు అమ్ముడు పోలేదన్నారు. మీకు మూడు సార్లు టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించింది బీఆర్ఎస్నేనని చెప్పారు. జగిత్యాల అభివృద్ధి జరిగింది అంటే అది కేసీఆర్, కవిత సహకారంతోనే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు, కవిత జైల్లో ఉన్నప్పుడు నమ్మకద్రోహంతో పార్టీ మారిన మీకు బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హకు లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్పర్సన్ శీలం ప్రియాంక ప్రవీణ్, ఉదయశ్రీ, పార్టీ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, మల్లేశం రాజు, సాగి సత్యంరావు, పడిగెల గంగారెడ్డి, సన్నిత్ రావు, వెంకటేశ్వర రావు, చింతల గంగాధర్, టౌన్ ప్రెసిడెంట్ అనిల్, స్పందన, శ్రీధర్, వీఎం గౌడ్, మహేశ్, సాగర్, రాజేందర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, యూత్ నాయకులు ప్రణయ్, ప్రతాప్, సాయి శ్రీనివాస్ గౌడ్, చందు, తదితరులు పాల్గొన్నారు.