ప్రైవేట్ దవాఖానలు ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్), ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపనీ పేరిట నకిలీ బిల్లులు క్లెయిమ్ చేసి కోట్లు దండుకున్నాయా..? చికిత్స పొందకున్నా.. ఫేక్ బిల్లులు సృష్టించి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల బీమా సొమ్ము కాజేశాయా..? అంటే అవుననే తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్, ప్రైవేట్ బీమా సంస్థల సొమ్ము స్వాహాపర్వం సాగినట్టు తెలుస్తుండగా, సీఐడీ రంగంలోకి దిగింది. తాజాగా పెద్దపల్లి, జమ్మికుంటలోని ప్రైవేట్ దవాఖానలపై కేసులు నమోదు చేయడం కలకలం రేపుతున్నది.
జమ్మికుంట, ఆగస్టు 26 : ఉమ్మడి జిల్లాలోని పలు ప్రైవేట్ దవాఖానాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్), ప్రైవేట్ బీమా సంస్థల సొమ్ము స్వాహా దందా నడిచిందనే ఆరోపణలు వచ్చాయి. ఆయా వైద్యశాలల నిర్వాహకులు, సిబ్బంది, దళారులు కలిసి నకిలీ బిల్లులు క్లెయిమ్ చేసి కోట్లు కొల్లగొట్టారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇప్పటికే ఓసారి ప్రాథమిక విచారణ జరిపారు.
ఈసారి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగారు. సీఎంఆర్ఎఫ్, ప్రైవేట్ బీమా సంస్థలకు చెందిన బిల్లుల క్లెయిమ్‌లలో ఎవరి ప్రమేయం ఎంత? దవాఖాన యాజమాన్యాలదా? నిర్వాహకులదా? అందులో పనిచేసే సిబ్బందిదా? తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దవాఖాన యాజమాన్యాలకు తెలియకుండానే రూ.కోట్లు ఎలా కొల్లగొట్టారు? బిల్లులెలా సృష్టించారు? ప్రైవేట్ బీమా సంస్థల పాలసీల్లో ఆయా సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా ఎలా క్లెయిమ్‌లు జరుగుతాయి? నకిలీ రోగులెవరు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
తాజాగా, సీఎంఆర్ఎఫ్ స్కాంలో ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానలపై రెండు కేసులు నమోదు చేశారు. పెద్దపల్లిలోని శ్రీసాయి, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ని సప్తగిరి దవాఖానల్లో వైద్యం చేయకపోయినా.. చేసినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, నకిలీ బిల్లులు సృష్టించారు. నిర్వాహకులు, సిబ్బంది, దళారులు కుమ్మక్కై సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు చేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టా రు. ఈ ఆరోపణల నేపథ్యంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, సీఐడీ అధికారులు గతంలో విచారణ చేశారు. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి, సదరు దవాఖానలపై ఛీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.
కేసులతో కలకలం
కొద్ది నెలలుగా సైలెంట్‌గా ఉన్న సీఐడీ అధికారులు, మరోసారి రంగంలోకి దిగి ప్రత్యేక నజర్ పెట్టారు. ఏడాది క్రితం జమ్మికుంటలోని సప్తగిరి ప్రైవేట్ దవాఖానలో జరిగిన స్కాంపై ప్రాథమిక విచారణ చేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. దవాఖాన ఏర్పాటు, సీఎంఆర్ఎఫ్, ప్రైవేట్ బీమా సొమ్ము కాజేసేలా ఇచ్చిన బిల్లులు, తదితర విషయాలపై ఆరా తీశారు. రికార్డులు, బిల్లులు పరిశీలించి, నకిలీ బిల్లులను గుర్తించారు. తాజాగా, కేసు నమోదు చేశారు. పెద్దపల్లిలోని మరో దవాఖానపైనా కేసు నమోదు చేయడంతో కలకలం రేగింది. సీఎంఆర్ఎఫ్, ప్రైవేట్ బీమా సంస్థల సొమ్ము స్వాహాపర్వం చేసిన హాస్పిటళ్ల యాజమాన్యాలు, నిర్వాహకులు, దళారులు వణికిపోతున్నారు.
మున్ముందు మరింత లోతుగా దర్యాప్తు చేయనుండగా, అక్రమార్కులు బెదిరిపోతున్నారు. కాగా, సీఎంఆర్ఎఫ్, ప్రైవేట్ బీమా క్లెయిమ్‌లపై సీఐడీ కరీంనగర్ జిల్లా డీఎస్పీ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. గతంలో జమ్మికుంట సప్తగిరి దవాఖానలో విచారణ చేసిన విషయం నిజమేనని, ప్రాథమిక దర్యాప్తులో నకిలీ బిల్లులను కొన్ని గుర్తించామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో దర్యాప్తు మరింత వేగవంతం చేస్తామని చెప్పుకొచ్చారు.