లైసెన్స్ ఉన్న లబ్ధిదారులకు వాహనాలు మంజూరు చేయాలి
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, మార్చి 29: దళితబంధు లబ్ధిదారులకు డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన దళితబంధు పథకంపై క్లస్టర్ అధికారులు, గ్రౌండింగ్ టీం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లైసెన్స్ ఉన్న లబ్ధిదారులు కోరితే వాహనాలు మంజూరు చేయాలని సూచించారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో దళితబంధు యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిశీలించి వారు కోరుకున్న వాహనాలను గ్రౌండింగ్ చేయాలని సూచించారు.
ప్యాసింజర్, గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు తదితర వాహనాలు ఇవ్వాలని ఆదేశించారు. డెయిరీ యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు షెడ్ల నిర్మాణం చేసుకున్నారా లేదా అనేది తనిఖీ చేయాలన్నారు. కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన దళితబంధు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను సూచించారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బులు వాపస్పోవని, ఎప్పుడైనా యూనిట్లను గ్రౌండింగ్ చేసుకునే వీలు ఉంటుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాం ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, డీటీసీ చంద్రశేఖర్ గౌడ్, డీఆర్డీవో శ్రీలత, ఎల్డీఎం లక్ష్మణ్, క్లస్టర్, గ్రౌండింగ్ టీం అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.