దళిత బంధు దళితుల దశ మార్చుతున్నది. గ్రూపు యూనిట్ల ఎంపిక సత్ఫలితాలనిస్తుండగా, తాజాగా పథకంలో మరో ముందడుగు పడింది. నిన్న మొన్నటిదాకా వ్యవసాయం చేసుకునే హుజూరాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు గన్నారపు అరుణాదేవి, పెరుక హేమలత ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సుకు ఓనర్లు కావడం ఔరా అనిపిస్తున్నది. ఆర్థిక స్థోమత ఉంటే తప్ప బస్సు కొనలేని పరిస్థితుల్లో ఏకంగా ఓ బస్సుకు యజమానులు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. అందరికీ భిన్నంగా అక్కాచెల్లెళ్లు తీసుకున్న నిర్ణయంపై అభినందనల వర్షం కురుస్తున్నది. కాగా, గురువారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ కర్ణన్ బస్సును కరీంనగర్ బస్‌స్టేషన్‌లో ప్రారంభించగా, లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినపుడే యూనిట్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకే ఇచ్చారు. వారు ఏది ఏర్పాటు చేసుకోవాలని ముందుకొస్తే అదే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇది నిరూపితమవుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో సుమారు 17 వేల కుటుంబాలను దళిత బంధు కింద ఎంపిక చేసిన అధికారులు, ఇప్పటి వరకు 13,701 యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. అందులో 500 యూనిట్లకుపైగా గ్రూపు యూని ట్లు ఇచ్చారు. వ్యక్తిగతమైనా, గ్రూపు యూనిట్స్ అయినా లబ్ధిదారుల ఇష్టానికే వదిలేశారు. కాకపోతే అధికారులు లబ్ధిదారులకు ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలో అవగాహన కల్పిస్తూ వచ్చారు. అందులో భాగంగా గ్రూపు యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఆర్టీసీ అద్దె బస్సులకు ప్రతిపాదన..
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చొరవతో దళితబంధు పథకం కింద భారీ వాహనాల కొనుగోళ్లు జరిగాయి. కొందరు ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు వ్యక్తిగత యూనిట్ల కింద పొందగా, మరి కొందరు గ్రూపులుగా హార్వెస్టర్లు, టిప్పర్లు, టూరిస్ట్ మినీ సర్వీసులు కూడా కొనుగోలు చేసుకున్నారు. గ్రూపులుగా ఏర్పడి బస్సులు కొనుగోలు చేసుకుంటే ఆర్టీసీలో అద్దెకు నడుపుకొనే అవకాశం కల్పిస్తామని కూడా అధికారులు అవగాహన కల్పిస్తూ వచ్చారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో చర్చించి దళితబంధు లబ్ధిదారులకు వంద బస్సుల దాకా కొనుగోలు చేయించి ఇస్తామని, టెండర్లు మినహాయించి ఆర్టీసీలో అద్దెకు తీసుకోవాలని విన్నవించినట్లు తెలిసింది. ఈ మేరకు సజ్జనార్ కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తున్నది. అయితే ఇది సాధ్యం కాదని కొందరు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేక పోయారు. కానీ ఇప్పుడు హుజూరాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు గన్నారపు అరుణాదేవి, పెరుక హేమలత కలిసి సెకండ్ హ్యాండ్ అయినా మంచి కండిషన్లో ఉండి, ఆర్టీసీలోనే అద్దెకు నడుస్తున్న బస్సును కొనుగోలు చేశారు. గురువారం కరీంనగర్ బస్టేషన్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ కర్ణన్ బస్సును ప్రారంభించడంతో ఆనందంలో మునిగిపోయారు. నిన్నా మొన్నటిదాకా సాధారణ వ్యవసాయం చేసుకున్న ఈ అక్కా చెల్లెళ్లు దళితబంధు పథకంతో ఇప్పుడు ఆర్టీసీ అద్దె బస్సుకు ఓనర్లు అయ్యారు. ఈ దిశగా ఎవరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా తాము కొత్త బస్సులు కొని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
అక్కా చెల్లెళ్లకు అభినందనలు..
అక్కాచెల్లెళ్లు అరుణారాణి, హేమలతను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్టీసీ ఆర్ఎం ఖుస్రోషా ఖాన్ అభినందించారు. వీరు తీసుకున్న నిర్ణయం మిగతా లబ్ధిదారులకు స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం సిరిసిల్ల డిపో పరిధిలో ఉండి, సిరిసిల్ల నుంచి వ రంగల్ వరకు నడుస్తున్న ఈ బస్సుకు ఆర్టీసీ నుం చి నెలకు 3.20 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇద్దరు డ్రైవర్ల వేతనాలు, సర్వీసింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చులు పోను 65వేల నుంచి 70 వేల వరకు మిగులుతాయని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు పంచుకున్నా నెలకు తలా 30 వేలకుపైగానే ఆదాయం వ స్తుంది. దళిత బంధు కింద వచ్చిన 20 లక్షలకుతోడు మరో 10 లక్షలు రుణం పొందిన అక్కాచెల్లెల్లు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అభినందనీయం. తలా ఎకరం వ్యవసాయ భూ మిలో పండిన పంటతో బతుకుతున్న ఈ దళిత కుటుంబాలకు ఇప్పుడు కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు కొండంత అండగా నిలిచింది.
మా దేవుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ సార్ మా దేవుడు. ఆయన రుణం జన్మజన్మలా తీర్చుకోలేం. నా భర్త చనిపోయిన తర్వాత ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంట పిల్లల్ని పెంచుకున్న. వ్యవసాయంలో వచ్చే ఆదాయం సరిపోక ఆ పని ఈ పని చేసుకునేదాన్ని. కేసీఆర్ సార్ ఇచ్చిన బస్సుతో ఇన్ని రోజులు పడిన కష్టాలన్నీ మర్చిపోతున్న. సాధారణ దళిత కుటుంబంలో పుట్టిన మేం ఒక బస్సు కొంటామని ఎన్నడూ ఊహించలేదు. కానీ, దళితబంధుతో ఒక బస్సుకు ఓనర్ అయిన. హుజూరాబాద్ నియోజకవర్గంల ఇపుడు ఎక్కడ చూసినా మా గురించే చెప్పుకుంటున్నరు. దళిత బంధు కింద బస్సు కొన్నరట అని మాట్లాడుకుంటున్నరు.
– గన్నారపు అరుణా దేవి
కలలో కూడా అనుకోలేదు..
దళిత బంధు కింద బస్సు తీసుకుంటమని కలలోకూడా అనుకోలేదు. సీఎం కేసీఆర్ సార్‌కు మేమెప్పటీకి రుణపడి ఉంటం. మా పిల్లలు కూడా మర్చిపోరు. మాకు ఇంత మంచి ఆలోచన చెప్పిన కలెక్టర్ సార్‌కు, ఎస్సీ కార్పొరేషన్ సార్లకు ధన్యవాదాలు. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం గడవడానికి నేను నా భర్త చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్లం. ఎంత చేసినా మా లాంటి కుటుంబాల్లో ఏదో లోటు ఉండేది. ఆర్థిక సమస్యలు వచ్చేవి. ఇపుడు నాకు ఎంతో ధైర్యం వచ్చింది.
– పెరుక హేమలత