దళితబంధు పథకం అమలు విషయంలో సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాల నాయకులు భగ్గుమన్నారు. విమర్శలు చేయడం కాదు, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తేవాలని సవాల్ విసిరారు. దళితులపై ప్రేముంటే ఇక్కడ అమలవుతున్నట్టుగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు వంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. గురువారం జమ్మికుంటతోపాటు వీణవంకలో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీణవంకలో దళితబంధు వాహనాలతో ధర్నా చేశారు. మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
జమ్మికుంటరూరల్/ వీణవంక, సెప్టెంబర్ 8 : దళితబంధు పథకం అమలు విషయంలో సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా, వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించి, ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల నాయకులు మాట్లాడుతూ, దళితుల భూములను అన్యాయంగా ఆక్రమించిన ఈటల మరోసారి దళితుల్లో ఉన్నవారికే దళితబంధు యూనిట్లు ఇస్తున్నారంటూ అనుచిత వాఖ్యలు చేయడం అతని ఓర్వలేని తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్ప పథకాన్ని తెచ్చి, పారదర్శకంగా అమలు చేస్తున్నారని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 90 శాతం దళిత కుటుంబాలకు యూనిట్లు అందజేశారని చెప్పారు. దళితబంధు యూనిట్లు తీసుకొని ఆర్థికాభివృద్ధి చెందుతుంటే కొందరికే ఇస్తున్నారంటూ మాట్లాడడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. దళితుల బతుకులు ఇప్పుడిప్పుడే బాగుపడుతుంటే ఓర్వలేక ఈటల ప్రెస్మీట్లు పెట్టి సీఎంపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. దళితులను అవమానపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. తమపై నిజంగా ప్రేముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు ఇవ్వాలని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమాల్లో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ జమ్మికుంట అర్బన్ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, వీణవంక ఉపసర్పంచ్ వోరెం భానుచందర్, వార్డు కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, గాజుల భాస్కర్, పాతకాల రమేశ్, జుగురు సదానందం, దయ్యాల శ్రీనివాస్, మేడిపల్లి రవీందర్, కుతాడి రాజయ్య, నాయకులు దేశిని సదానందం, భోగం వెంకటేశ్, వోరెం శ్రీనివాస్, దాసారపు కృష్ణచైతన్య, వోరెం క్రాంతి, దాసారపు రాజేంద్రప్రసాద్, కొమురయ్య, బోగం శ్రీనివాస్, భాస్కర్, కడబంద ప్రవీణ్, రాజు, రాజేశం, వంశీ, రాజేందర్, మధునయ్య, అఖిల్, దాసారపు క్రాంతి, అంజి, వేల్పుల కుమార్, మల్లేశ్, సంతోష్, దేవయ్య, మరో 50 మంది దళితులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.