దళితబంధు రెండో విడుత ఆర్థిక సాయం కోసం దళితబిడ్డల పోరాటం కొనసాగుతూనే ఉన్నది. అనేక పోరాటాలతో ఖాతాలపై మూడున్నర నెలల కిందటే ఫ్రీజింగ్ ఎత్తివేసినా.. నేటికీ విడిపించుకునే అవకాశం లేక మరోసారి రోడ్డెక్కాల్సి వస్తున్నది. సోమవారం సుమారు 60 మంది హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు కరీంనగర్ వచ్చి, కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. కుంటి సాకులతో గ్రౌండింగ్ చేపట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహించారు. దళితుల అభ్యున్నతిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. తర్వాత కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వచ్చే నెలలో గ్రౌండింగ్ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించడం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు.
కరీంనగర్, మే 12 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కలెక్టరేట్ : దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 18,021 మందికి పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఎంపికైన ప్రతి లబ్ధిదారుకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రకంగా 9,873 మందికి పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మిగిలిన 8,148 మందికి వారి అవసరాన్ని బట్టి ఆర్థిక సహాయాన్ని విడిపించుకునే అవకాశం ఇచ్చింది. మిగతా మొత్తాన్ని విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుండగానే 2023 డిసెంబర్లో ఎన్నికలు రావడం, ఎన్నికల కమిషన్ దళిత బంధు పథకంపై ఆంక్షలు విధించడంతో రెండో విడుత ఆర్థిక సహాయం లబ్ధిదారులు విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికి లబ్ధిదారుల ఖాతాల్లోనే ఉన్న నిధులను ఎన్నికల తర్వాత కూడా విడిపించుకోవచ్చని అందరు భావించారు. కానీ, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల ఖాతాలపై ఆంక్షలు విధించింది. దీంతో ఆర్థిక సహాయాన్ని తమ వ్యాపార అవసరాలకు విడిపించుకొనే ప్రయత్నం చేయగా లబ్ధిదారులకు చుక్కెదురైంది.
దళితబంధు అంటేనే కక్ష కట్టినట్టు చూస్తున్రు. రెండో విడుత పైసలు ఎందుకు ఫ్రీజ్ చేసినట్లు? అసెంబ్లీ ఎన్నికల ఓట్లతోని సంబంధం లేకుంటనే మా ఖాతాలల్ల పైసలు పడ్డయి. మా పైసలు మాకు ఇచ్చేతానికి ఎందుకు ఇట్ల చేస్తున్నరు? గత ప్రభుత్వం మమ్ములను ఆర్థికంగా ఎదిగేలా చూస్తే, ఈ ప్రభుత్వం మాత్రం అప్పుల పాలు చేసింది. ఓట్లకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వేరున్నయ్. ఇప్పుడు చేస్తున్న పనులు వేరున్నయ్. మేమంతా కాంగ్రెస్ పార్టీకే మద్దతిచ్చినం. మేము ఓట్లేయందే హుజూరాబాదుల కాంగ్రెస్‌కు గన్ని ఓట్లచ్చినయా..? ఓట్లకు దళిత బంధుకు సంబంధమే లేదు. మమ్ములను ఏడాదిన్నర నుంచి ఎందుకు ఏడిపిస్తున్నరు? కాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములను ఆదరిస్తదని సంబురపడితే గిట్ల జేస్తరా..? మమ్ముల ఇబ్బంది పెట్టుడు మీకు మంచిది కాదు.
మా కష్టాలు చూడ లేక కేసీఆర్ మాకు దళిత బంధు పథకం పెట్టిండు. మమ్ములను ఓ దారిల పెట్టాల్నని చూసిండు. దళిత బంధు కింద మొదటి సారి వచ్చిన పైసలతోని దుకాణాలు పెట్టుకున్నం. పైసలు సరిపోక అప్పులు తెచ్చి షాపులు నడుపుతున్నం. వడ్డీ మీద వడ్డీ పెరుగుతంది. అప్పులు ఇచ్చినోళ్లు అడుగుతున్నరు. మా మీద నమ్మకం పోతంది. ఇగస్తయి ఇస్తం.. ఆగస్తయి ఇస్తమని ఇన్ని రోజులు జరిపిన్రు. మా పైసలు మాకు ఇచ్చేతానికి మీ కేం కడుపునొప్పయితంది. మేం బాగుపడుడు ప్రభుత్వానికి ఇష్టం లేదా..? ఇప్పటికి యాడాదినర్ధమైతంది ఇంకెప్పుడు ఇస్తరు? మేం అప్పులు కట్టుకోవద్దా..? రూపాయి సంపాయించుకోవద్దా..?
దళితబంధు పథకానికి ఎంపికైన వారంతా మొదటి విడుత డబ్బులతో యూనిట్లు మొదలు పెట్టిన్రు. ఇప్పుడిప్పుడే యూనిట్లు పురోగతిలోకి వస్తున్నయి. రెండో విడుత డబ్బులతో యూనిట్లపై మరింత పెట్టుబడి పెట్టి, ముందుకు పోవాలంటే డబ్బులు డ్రా చేసుకోనివ్వాలె. లేదంటే అప్పులు తెచ్చి యూనిట్లు నడిపిస్తున్న దళితులంతా బజారున పడే పరిస్థితి కనిపిస్తున్నది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన వారున్నరు. డబ్బులు విడిపించుకోకుండా ప్రభుత్వం అడ్డుపడుతుండడంతో వారంతా దివాళా తీసుడు ఖాయం. అప్పులు ఇచ్చిన వాళ్లంతా ఒత్తిడి తెస్తే వారికి ఏం ఇవ్వాలే? యూనిట్లను మేమెలా నడపాలే? రాష్ట్ర ప్రభుత్వం ఇది ఆలోచించాలే. లేకుంటే ఒత్తిడి ఎక్కువై మేమంతా మా కుటుంబాలు విడిచి పారిపోవాల్సి వస్తది. అలా జరిగితే, ఆ పాపం రాష్ట్ర ప్రభుత్వానిదే అయితది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికైనా మా డబ్బులు మేం విడిపించుకునేలా చూడాలి. లేకుంటే సామూహికంగా హైదరాబాద్‌కు పాదయాత్ర చేపడుతం.
ఫ్రీజ్ చేసిన దళితబంధు ఖాతాల్లోని డబ్బులు గ్రౌండింగ్ చేయాలంటూ జనవరి 27న ఉత్తర్వులు విడుదల చేసిన్రు. కానీ, ఇప్పటివరకు గ్రౌండింగ్ చేస్తలేరు. రీవెరిఫికేషన్ చేస్తామంటూ మమ్ములను ఇబ్బందులు పెడుతున్రు. దళితబంధు పథకంలో ప్రారంభించిన యూనిట్లన్నీ ఎక్కువ మంది సొంత స్థలం లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో ఏర్పాటు చేసుకున్నరు. మొదటి విడుతల వచ్చిన మొత్తంతో యూనిట్ సామగ్రి తెచ్చుకున్నరు. రెండో విడత డబ్బులు రాక అద్దెలు చెల్లించలేక వాటిని ఖాళీ చేసి, వేరే చోట్ల ఏర్పాటు చేసుకున్నరు. దీనిని ప్రశ్నిస్తే మాకేం తెలియదు? ఉన్నతాధికారుల ఆదేశాలంటూ అధికారులు తప్పించుకుంటున్నరు. ఇప్పటికైనా మా బ్యాంకు ఖాతాల్లోని నగదు విడిపించుకునేలా అధికారులు చొరవ చూపాలె. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేయక తప్పదు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ ఖాతాల్లో ఉన్న డబ్బులు తాము విడిపించుకునేందుకు ప్రభుత్వ ఆంక్షలేమిటని ప్రశ్నించారు. ‘దళిత బంధు సాధన సమితి’ పేరిట ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఆందోళనలు, నిరసనలు ప్రారంభించారు. అధికార కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్ సహా వివిధ రాజకీయ పక్షాలు వీరికి మద్దతుగా నిలిచాయి. నిరంతర పోరాటాలు చేస్తున్న దళితబంధు సాధన సమితిపై పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. దళితులు ఏదైనా నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిసిన వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం మొదలు పెట్టారు. దళితబంధు గురించి ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారు. అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులపైనా కేసులు పెట్టారు. తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత బంధు ఖాతాలపై ఫ్రీజింగ్ ఎత్తివేస్తూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో దళితుల్లో ఆశలు చిగురించాయి. సర్క్యులర్ విడుదలైన రెండు రోజులకే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో దళిత బంధుకు మరోసారి ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికలు ముగిసి, కోడ్ ఎత్తి వేసే వరకు దళితులు నిరీక్షించారు. ఆ తర్వాత మార్చి 10 నుంచి అధికారుల చుట్టు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు అధికారులు స్పందించ లేదు. దళిత బంధు రెండో విడత ఆర్థిక సహాయం అందించ లేదు.
దళితబంధు అంటేనే అధికారులు అదో రకమైన ఏహ్య భావంతో చూస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలిగిపోయి రెండు నెలలు గడుస్తున్నా ఒక్కరికి కూడా రెండో విడుత ఆర్థిక సహాయం అందించ లేదని ఆవేదన చెందుతున్నారు. పథకం అమలు చేసినప్పుడు స్థాపించిన యూనిట్లు ఉన్నాయా.. లేవా..? అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎక్కువ శాతం యూనిట్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే క్లస్టర్ అధికారులు పరిశీలించారు. 2,400 మంది లబ్ధిదారులకు డబ్బులు విడుదల చేసే సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా వెరిఫికేషన్ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అయితే మొదటి విడుతలో అందిన ఆర్థిక సహాయంలో వ్యాపారానికి అవసరమై ఫర్నిచర్, అద్దె గదుల అగ్రిమెంట్లు, డిపాజిట్లకే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వచ్చింది. మిగిలిన కొద్దిపాటి నగదుతో వ్యాపారానికి అవసరమైన వస్తువులు, సామగ్రి కొనుగోలు చేసుకున్నారు. రెండో విడత ఆర్థిక సహాయం అందడంలో జరిగిన తీవ్ర జాప్యం కారణంగా కొందరు వ్యాపారాలు నిలిపివేసి ఎప్పటిలాగే కూలీ నాలీ చేసుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారిని కూడా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. వారి పరిస్థితిని బట్టి ఇలాంటి వారికి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని లబ్ధిదారులు కోరుతున్నారు.
దళితబంధు ఖాతాలు ఫ్రీజ్ చేసిన తర్వాత లబ్ధిదారులు మంత్రులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే ఇప్పుడు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 9,937 మందికి రెండో విడత కింద 324.75 కోట్లు రావల్సి ఉండగా, పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 8,148 మందికి 274.60 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో ఫ్రీజింగ్లో ఉన్నాయి. వీటిని విడిపించుకునేందుకు జనవరి 27న సర్క్యూలర్ జారీ అయినా ఇప్పటి వరకు అధికారుల్లో ఉలుకూ పలుకూ లేదు. నియోజకవర్గంలోని ఎంపీడీవోలు ఇద్దరు మున్సిపల్ కమిషనర్ల వద్దకు వెళ్లి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఒక్క ఇల్లందకుంట మండలంలోని రెండు మూడు గ్రామాల్లో తప్పితే ఇప్పటి వరకు ఎక్కడా రీ వెరిఫికేషన్ అనేది జరగ లేదని తెలుస్తున్నది. తమకు వేరే పనులు ఉన్నాయని, తీరినపుడు వెరిఫికేషన్ చేస్తామని తమనే బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సుమారు 60 మంది సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తర్వాత లబ్ధిదారులు ప్రజావాణిలో కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. దీనిని వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ పవన్ కుమార్‌కు చెప్పారు. అయితే వచ్చే నెలలో పరిశీలిస్తామని చెప్పడంతో దళితులు తిరిగి వెళ్లారు. వచ్చే నెలలో కూడా తమ పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్ర స్థాయిలో ఆందోళన చేయక తప్పదని ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులు స్పష్టం చేశారు.