కథలాపూర్/ సారంగాపూర్, ఆగస్టు 7: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్‌లో లింక్‌లు పంపిస్తూ.. ఓపెన్ చేసిన వారి ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇలా బుధవారం ఒకే రోజు వేర్వేరు చోట్ల లక్షన్నర మాయం చేశారు. కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు యూనియన్ బ్యాంక్ లోగోతో వచ్చిన లింకును క్లిక్ చేయగా.. బ్యాంక్ ఖాతా నుంచి 1,13,804 కాజేశారు. ఈ విషయాన్ని బాధితుడు ఆలస్యంగా గుర్తించి, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నవీన్‌కుమార్ తెలిపారు. ఇదే తరహాలో సారంగాపూర్ ఎంపీడీవో ఆఫీస్‌లో అసిస్టెంట్ శివప్రసాద్ మోసపోయాడు. ఈ నెల 5న మధ్యా హ్న భోజన సమయంలో తన వాట్సాప్ మెసేజ్‌లను చూస్తూ.. యూనియన్ బ్యాంక్ లోగో తో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేశాడు. బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ అనుకుని వివరాలు నమోదు చేశాడు. అంతే అరగంటలోనే 5వేల చొప్పున ఐదు సార్లు 25వేలు, మరోసారి 15వేలు డ్రా కావడంతో లబోదిబోమన్నాడు. మోసపోయానని గ్రహించి అదే రోజు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు.