బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్‌వర్క్‌ను కరీంనగర్ సైబర్ పోలీసులు చేధించారు. ఈ ఘటన వివరాలను శుక్రవారం సీపీ గౌష్ ఆలం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కరీంనగర్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కిన కొందరు వివిధ బ్యాంకులలో వర్చువల్‌గా ఖాతాలు ఓపెన్ చేస్తూ వాటి వివరాలు సైబర్ నేరగాళ్లకు ఇస్తున్నారు. ఆ ఖాతాలకు సైబర్ నేరగాళ్లు నగదును బదిలీ చేసి, వాటి నుంచి ఇతర మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు. ఇందుకు సహకరిస్తున్న ఖాతాదారులకు సైబర్ నేరగాళ్లు 2 శాతం కమీషన్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు, ఖాతాదారులకు కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.
వీరికి కొందరు బ్యాంక్ మేనేజర్లు కూడా సహకరిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు అందిన ఫిర్యాదుపై ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరుతో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కరీంనగర్ కిసాన్‌నగర్‌లోని ఆర్బీఎల్ బ్యాంక్‌లో కొందరి ఖాతాలను పరిశీలించగా పెద్ద మొత్తంలో సైబర్ నేరాల గుట్టు బయట పడింది. జగిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన బండారి సాయిరాం, ఇదే జిల్లా బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన అనుమాండ్ల రంజిత్, జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బోగ రాకేశ్, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన అలిగేటి మల్లేశం, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన బండి ప్రవీణ్ మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు వీరి ఖాతాలను కూడా విరివిగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఇక తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించుకుంటారని తెలిసి సహకరించిన ఖాతాదారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన విభూది రాంకుమార్, జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన నతర్ల శ్రీనివాస్, జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్, కోండ్ర నరహరి, కల్లెడ రాకేశ్, వరంగల్‌కు చెందిన కర్రె రాజు ఉన్నారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ మాన్యువల్‌గా తీయాల్సిన సేవింగ్, కరెంట్ అకౌంట్లను వర్చువల్‌గా తెరిచేందుకు సహకరించిన ఆర్బీఎల్ కిసాన్‌నగర్ బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ వరంగల్‌కు చెందిన భువనగిరి కళ్యాణ్, క్యాషియర్ ఆయేషా బేగంను పోలీసులు కటకటాల్లోకి పంపించారు. వీరిపై బీఎన్ఎస్ సెక్షన్ 112, 318(4), ఐటీ యాక్ట్ సెక్షన్ 66-డీ కింద కేసులు నమోదు చేశారు.
కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో ఉన్న ఆర్బీఎల్ బ్యాంక్‌లో పెద్ద మొత్తంలో మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు అనుమానం వచ్చిన పోలీసులు గత 20 రోజులుగా ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరిట దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కొందరికి ఈ విషయంలో అరెస్టు చేసి జైలుకు పంపించారు. లోతుగా దర్యాప్తు చేస్తుండగా విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క ఆర్బీఎల్ బ్యాంక్ మ్యూల్ అకౌంట్లు, వర్చువరల్ అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో లావా దేవీలు జరిగినట్లు స్పష్టమైంది.
వర్చువల్ ఖాతాల ద్వారా రూ.12 కోట్ల 25 లక్షల 31 వేల 665, మ్యూల్ అకౌంట్ల ద్వారా రూ.125 కోట్ల 80 లక్షల 71 వేల 688 మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలు వాడుకున్నందుకు సైబర్ నేరగాళ్లు మధ్యవర్తులు, ఖాతాదారులు, బ్యాంక్ అధికారులు ఒక్కొక్కరికి 2 శాతం కమీషన్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, మధ్యవర్తులు ఉన్న ఐదుగురిలో ఒకరి ఖాతాలో రూ.60 కోట్లకు 1పైగా లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. రూ.1.20 కోట్ల కమీషన్ ముట్టినట్లు తెలుస్తోంది. ఖాతాలు వాడుకున్నందుకే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరుతుండటంతో కొందరు ఈ తరహా నేరాల వైపు మల్లుతున్నట్లు స్పష్టమవుతోంది.