మానకొండూర్ రూరల్, జూన్ 6: మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను ఆగం చేస్తున్నాయి. మొన్న యాసంగిలో కాంగ్రెస్ సర్కారు అప్రకటిత కోతలతో పంటలన్నీ ఎండిపోగా, ఇప్పుడు వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పల్లెల్లో కరెంట్ ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు ఉంటుందో తెలియకుండగా.. ఇప్పటికే పోసిన నారుమడులకు నీళ్లు పెట్టే దారి లేక ఎండిపోయే దుస్థితి వచ్చింది. ఇప్పటికే అక్కడక్కడా ఎండిపోతుండగా, రైతులోకం ఆగ్రహిస్తున్నది.
మానకొండూర్ మండలం రంగపేటలో రైతులు గోపు ఈశ్వర్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, కొత్త శ్రీకాంత్ రెడ్డి, ముదిగంటి జీవన్ రెడ్డితో మరి కొందరు ఇటీవల నారు మళ్లను తయారు చేసి మొలకను చల్లారు. రోజు వారీగా నారు పోసి తడి ఇస్తున్నారు. కరెంట్ ఇక్కట్లతో ఆగమవుతున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల దాకా కరెంట్ లేక.. మడులకు నీరు పెట్టుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. పవర్ కట్ అయినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉంటున్నదని వాపోతున్నారు. విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని రైతులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ సర్కారులోనే బాగున్నదని, 24 గంటల కరెంట్‌తో ఏ బాధా లేకుండా పంటలు పండించుకున్నామని చెబుతున్నారు.