వేములవాడ, జనవరి 18: వేములవాడ బల్దియా కార్యాలయానికి కరెంట్ కట్ అయింది. సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థకు 2.50 కోట్ల బకాయిలు పేరుకకుపోవడంతో సెస్ అధికారులు బుధవారం విద్యుత్ కనెక్షన్ తొలగించారు. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు నీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించి సుమారు 2.50 కోట్ల మేరకు బకాయిలు చేరుకున్నాయి. అయితే వారం కిందటే విద్యుత్ కనెక్షన్ తొలగించగా కలెక్టర్ చొరవతో పునరుద్ధరించారు.
బుధవారం గడువు ముగిసినా బిల్లులు కట్టలేదు. వెంటనే బిల్లులు కట్టాలని సెస్ ఏఈ సిద్దార్థ బల్దియా కమిషనర్ అన్వేశ్ను కోరారు. 12 లక్షల చెకు ఇవ్వగా సెస్ అధికారులు తిరసరించారు. అందులో కనీసం కోటి అయినా చెల్లించాలని పట్టుబడుతూ బుధవారం కనెక్షన్ తొలగించారు. మరో రెండు రోజుల తర్వాత వీధి దీపాల కనెక్షన్ కూడా తొలగిస్తామని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం జనరేటర్ సహాయంతో మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా చేస్తున్నారు.