ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి జిల్లాలో ముహూర్తం ఖరారు చేసింది. ఆ మేరకు ఈనెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ జరగనున్నది. అందుకోసం అధికార యంత్రాంగం రెడీ అవుతుండగా, ఈ ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాల్లో నిర్వహించిన ‘సర్’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారన్న ఆందోళన ఆయా రాష్ర్టాల్లోని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అయినా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దీనిని తోసిపుచ్చుతూ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలోనే మన ఉమ్మడి జిల్లాలో ‘సర్’ కొనసాగించడానికి ఏర్పాట్లు చేస్తుండగా.. అందులో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, అందులోనూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న సర్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశ వ్యాప్తంగా 16 రాష్ర్టాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) మూడో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా ఆయా రాష్ర్టాల్లో ప్రక్రియ నిర్వహించేందుకు భారత ఎలక్షన్ కమిషన్ (ఈసీఐ) స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా మన రాష్ట్రంలోనూ ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24 మధ్యన చేపట్టేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనూ జరగనున్నది. ఓటర్లు, అధికారులు, రాజకీయపార్టీల భాగస్వామ్యంతో ఈ ప్రక్రియను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే ఈసీ స్పష్టం చేసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్‌బూత్‌కు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి, బూత్‌లెవల్ అధికారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సర్వే జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి చేపడుతున్నారు. ఇప్పటికే 2002 నాటి ఓటరు జాబితాతోపాటు తాజాగా ఓటర్ల జాబితాలను బీఎల్వోలకు అందించారు.
సర్వేలో ఏమి చేస్తారు?
అనర్హుల తొలగింపుతోపాటు భారత పౌరుల ఓటరు నిర్ధారణ కోసం ఈ సర్వే ప్రారంభమైంది. 2002లో ఆనాడు ‘సర్’లో భాగంగా తయారు చేసిన ఓటరు జాబితాతోపాటు 2025లో తాజాగా రూపొందించిన జాబితాను పరిశీలిస్తూ, వివరాలు పోలుస్తూ అర్హులైన ఓటర్లను గుర్తిస్తారని ఈసీ చెబుతున్నది. 2002లో ‘సర్’లో భాగంగా నమోదైన ఓటర్లు ఆయా నివాసాల్లోనే ఉంటున్నారా.. లేదా? స్థానికంగా నివసిస్తున్నారా.. లేదా? ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్ అవుతున్నదా.. లేదా? అనే వివరాలు లోతుగా చూస్తారు. అందులో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దీన్నే మ్యాపింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా 2002, 2025 ఓటర్ల జాబితాల్లో (రెండింటిలో) పేర్లు ఉండి, అక్కడే నివాసముంటే వారిని మొదటి కేటగిరీగా గుర్తిస్తారు. అలాగే వివిధ కేటగిరీలుగా ఓటర్లను గుర్తించి, అర్హత ఉన్న ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ముసాయిదా జాబితాను ప్రచురిస్తామని అధికారులు చెబుతున్నారు.
భిన్నాభిప్రాయాలు
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు స్వాగతిస్తుండగా, మరికొన్ని వర్గాలు భిన్నమైన అభిప్రాయాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు విమర్శలు కూడా చేశాయి. ప్రక్రియ జరిగే సమయంలో సరైన సమాచారం ఇవ్వకుండా పేర్లు తొలగించారని పేదలు, వలస కార్మికులు చెబుతుండగా, మైనారిటీల పేర్లు ఎక్కువగా తొలగింపునకు గురవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ధ్రువీకరణ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదన్న విమర్శలు వచ్చాయి. నిజానికి సర్ ఉద్దేశం మంచిదే అయినా.. ఆచరణ తీరుపైనే అనుమానాలు వస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా పలు రాష్ర్టాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నో సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
వివిధ రాష్ర్టాల్లో సుమారు 5.50 కోట్ల ఓట్ల తొలగింపు
ఇప్పటి వరకు రెండు దశలుగా వివిధ రాష్ర్టాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పూర్తయింది. ఇంకా పలు రాష్ర్టాల్లో కొనసాగుతున్నది. తాజాగా మూడో దశ 16 రాష్ర్టాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొదటి, రెండో దశలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిన సర్ కార్యక్రమం కింద దాదాపు 5.50 కోట్ల ఓట్లు తొలగింపునకు గురైనట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒకసారి ఆయా రాష్ర్టాల్లో ఇంచుమించుగా తొలగింపునకు గురైన ఓట్ల వివరాలు పరిశీలిస్తే.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 2.05 కోట్లు, వెస్ట్ బెంగాల్లో 83.86 లక్షల ఓట్లు తొలగింపుకు గురైనట్టు లెక్కలు చెబుతున్నాయి. అలాగే తమిళనాడులో సుమారు 74 లక్షలు, గుజారాత్‌లో 68 లక్షలు, మధ్యప్రదేశ్‌లో 34.25 లక్షలు, రాజస్థాన్‌లో 31 లక్షలు, చండీగఢ్‌లో 25 లక్షలు, కేరళలో 9 లక్షలు, గోవాలో 1.28 లక్షలు, పాండిచ్చేరిలో 77 వేలు, అండమాన్ నికోబార్‌లో 52 వేలు, మొదటి దశలో బిహార్‌లో సుమారు 47 లక్షల ఓటర్ల పేర్లు తొలగించినట్టు తెలుస్తున్నది.
సన్నమద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
ఈసీ ఆదేశాల ప్రకారం చూస్తే.. సర్ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తుంది. అందుకోసం ఆయా రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్‌బూత్‌కు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో చూస్తే 3,600 పై చిలుకు పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. అంటే ఆ మేరకు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి. వీరు, బీఎల్వోలు సంయుక్తంగా కలిసి పనిచేయాలి. తద్వారా నిజమైన ఓటర్ జాబితా సిద్ధమవుతుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడుతున్నది. ఇదే క్రమంలో ఈ కార్యక్రమంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఓటరుకు ఏ రూపంలో అన్యాయం జరిగిందని భావించినా తిరిగి పై అధికారులకు అప్పీల్ చేసుకునే వెసలుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.
అయితే సర్ కార్యక్రమం కూడా ఉమ్మడి జిల్లాలో అత్యంత కీలకంగా మారనున్నది. ఉమ్మడి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండు లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అందులో కొన్ని చోట్ల నకిలీ ఓట్లు ఉన్నాయన్న విమర్శలున్నా.. మరికొన్ని చోట్ల అర్హత ఉన్న ఓటర్లు ఇప్పటికీ ఓటు హక్కు పొంద లేకపోతున్నారన్న ఆవేదన ఉన్నది. ఈ పరిస్థితుల్లో సర్ కార్యక్రమం కింద నిజమై ఓటరుకు ఓటరు జాబితాల్లో చోటు కల్పించడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని రాజకీయపార్టీలు కోరుతున్నాయి. ఇదే సమయంలో నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా అంటే తొలగింపునకు గురి కాకుండా చూడాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఓటర్లు కూడా అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈసీ మాటల్లో సర్ ఉద్దేశం ఇదే!
డూప్లికేట్ ఓట్లతోపాటు ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా రాష్ర్టాల్లో ఓట్లు నమోదై ఉంటే వాటిని గుర్తించి తొలగించడం.
మరణించిన ఓటర్ల పేర్లు, చనిపోయిన తర్వాత కూడా జాబితాలో కొనసాగుతున్న పేర్లను తీసివేయడం.
వేరే ప్రాంతాలకు మారిపోయిన వారి పేర్లు తొలగించడం,ఇతర రాష్ట్రం లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పాత ఓటరు నమోదు తొలగించడం.
నకిలీ లేదా తప్పు నమోదులను సరిచేయడం, ఒకే వ్యక్తికిరెండు ఎపిక్ కార్డులు, తప్పుడు వయసు/చిరునామా వంటి సమస్యలను సవరించడం. పద్దెనిమిదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరినీ కొత్త ఓటర్లుగా చేర్చడం, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను జాబితాలో చేర్చడం. తప్పులు లేని జాబితాను అందుబాటులోకి తేవడం, ఎన్నికల సమయంలో అక్రమ ఓటింగ్, బోగస్ ఓట్లు తగ్గించడమే ప్రధాన లక్ష్యం.
ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య
నియోజకవర్గం : ఓటర్లు
కరీంనగర్ : 3,68,166
చొప్పదండి : 2,35,849
మానకొండూర్ : 2,26,385
హుజూరాబాద్ : 2,52,351
కోరుట్ల : 2,48,270
జగిత్యాల : 2,39,114
ధర్మపురి : 2,33,182
రామగుండం : 2,19,723
మంథని : 2,39,699
పెద్దపల్లి : 2,57,192
సిరిసిల్ల : 2,23,115
వేములవాడ : 2,13,284