Kamanpur | కమాన్పూర్, జూలై 17 : నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కమాన్పూర్, పేరపల్లి, జూలపల్లి, పెంచికల్పేట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఏఆర్ఎస్) హెడ్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర మాట్లాడుతూ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వరి సాగు చేయాల్సి వస్తే తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే తెలంగాణ సోనా, కేఎన్ఎం–1638 వంటి రకాలను వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేయడం ద్వారా నీటి వినియోగం, సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. అలాగే పత్తి, కంది, పెసర, మినుము, ఆయిల్ పామ్ వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉందని, తక్కువ నీటితో అమలు చేయగల బొట్టు (డ్రిప్) పద్ధతుల ద్వారా వాటిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు.
వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగులో ప్రారంభ దశలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందని, విత్తిన 15 నుంచి 25 రోజుల మధ్య కలుపు మొక్కలు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు సిఫారసు చేసిన కలుపు మందులను పిచికారీ చేయడం ద్వారా సమర్థవంతంగా నివారించవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఏవో రామకృష్ణ, ఏఈవోలు డీ శ్వేత, వీ నవీన్, సర్పంచులు రంగు సత్యనారాయణ గౌడ్, బొంగోని సదయ్య, పల్లె మాధవి–నారాయణ, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.