సారంగాపూర్ : మండలంలోని పొతరం గ్రామ శివారులోని నాయకాపు గూడెంలో పంటలకు సాగు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. నాయకాపు గూడెం పరిధిలో వ్యవసాయ బావుల్లో నీరు అడుగం టుతుండడంతో పంటలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి(Crops drying). ఎస్సారెస్పీ 1ఆర్ కెనాల్ ద్వారా చెరువులు, కుంటలను నింపకపోవడంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామ శివారులోని హన్మంతరావు కుంటలో కాలువ నీరు అందక కుంట అడుగంటిపోయింది. ఈ కుంట కింద సుమారు 60 ఎకరాలు ఉంటే సాగు నీరు అందని దాదాపు 50 ఎకరాలు బీడుగా ఉంచారు.
ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి తట్ర భీమారెడ్డి అనే రైతు తన పొలంలో వేసిన వరి సాగునీరు అందక ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బద్ది లావణ్యకు చెందిన 20 గుంటలు పొలం ఎండిపోవడంతో ఎడ్లు మెపుతున్నారు. పల్లపు లచ్చయ్య అనే రైతు కుంట కింద రెండు ఎకరాలు బీడుగా వదిలేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న జడ్పీ మాజీ చైర్మెన్ దావా వసంత ఎండిన పంటలు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అండగా ఉన్నారని, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఎందుకు లేవని ప్రశ్నించారు.