కోనరావుపేట, నవంబర్ 7 : అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. వానకాలం సీజన్ మొదటి నుంచి దెబ్బమీద దెబ్బ తాకుతున్నది. అష్టకష్టాలు పడి పంటలు సాగుచేస్తే.. చేతికందే దశలో పెట్టుబడులకు కూడా మునగాల్సి వస్తున్నది. వ్యయ ప్రయాసాలకోర్చి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే.. అకాల వర్షాలతో ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఇటీవలి వానలతో ఎక్కడికక్కడ ధాన్యం తడిసిపోగా.. నేడో రేపో కోసేందుకు సిద్ధంగా ఉన్న వందలాది ఎకరాల్లో వరులు నేలవాలాయి. వారం రోజులైనా తడారకపోగా, అక్కడక్కడ బురదమయం అయ్యాయి. పొలాలను చూసిన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరులు కోయించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. టైర్ల యంత్రాలతో కోసే పరిస్థితి లేకపోవడంతో రేటు ఎక్కువైనా సరే పంట దక్కితే చాలని చైన్ హార్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు. అదనపు భారంతో అవస్థలు పడుతున్నారు.
దీంతో టైర్ మిషన్ గంటకు కిరాయి 2800 కాగా, చైన్ మిషన్ నిర్వాహకులు మాత్రం గంటకు 3500 నుంచి 4వేల వరకు తీసుకుంటున్నారు. కాగా, ఎకరం కోయాలంటే సుమారు రెండు గంటల సమయం పడుతున్నది. ఈ లెక్కన ఎకరాన 7వేలు అవుతున్నది. అదే టైర్ మిషిన్తో కోస్తే 5600 సరిపోయేది. దీంతో రైతులకు ఎకరాకు 1400 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గిరాకీ ఎక్కువ ఉండడంతో చైన్ హార్వెస్టర్లు దొరకడం లేదు. కోతలు ఎక్కువయ్యే కొద్దీ హార్వెస్టర్లకు డిమాండ్ పెరుగుతున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా రేట్ల పెరిగే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పశుగ్రాసానికీ కొరతే బురదగా మారిన పొలంలో వరి చైన్ మిషిన్ కోయడం ద్వారా పశువులకు గడ్డి లేకుండా పోతున్నది. నేలవాలిన వరిని కోయడానికి మిషిన్ పూర్తిగా వెనుకకు ముందుకు వెళ్లడం, గడ్డి పూర్తిగా నూర్పిడి అయిపోయి బురదలోనే కూరుకుపోతున్నది. దాంతో పశుగ్రాసం చేతికిరాకుండా పోతున్నది.
నాకున్న మూడెకురాలతోపాటు మరో మూడెకురాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేసిన. పంట ఏసినప్పటి నుంచి అరిగోస పడ్డ. పంట మంచిగా ఎదుగుతున్న సమయంలో యూరియా దొరకక ఇబ్బందులు పడ్డ. ఇగ ఇప్పుడు పంట చేతికొచ్చే దశల వర్షాలు పడి పంట పూర్తిగా నేలవాలింది. దాని మీద నుంచి వరద పోవడంతో పొలం బురదమయమైంది. కనీసం పెట్టిన పెట్టుబడన్న వస్తదని కోయించుదామనుకుంటే చైన్ హార్వెస్టర్లు దొరుకుత లేవు. నాలుగైదు రోజుల సంది తిరుగుతున్న. చేసేదేమీ లేక ఇద్దరు కైకిళోళ్లను పెట్టుకుని మూడెకరాలు చేతకోసిన.
– నాలికె చిన్న రాజయ్య, రైతు, వెంకట్రావుపేట (కోనరావుపేట)