కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న రుణమాఫీ గందరగోళంగా మారింది. ప్రభుత్వం చెప్పిన దానికి.. ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన కరువైంది. లక్ష, లక్షా యాభైవేలలోపు లోన్ తీసుకున్న రైతులు లక్షల్లో ఉంటే.. మాఫీ మాత్రం కొందరికే జరిగింది. రెండు విడుతల్లోనూ మెజార్టీ రైతుల పేర్లు గల్లంతు కాగా, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడుతూ మెజారిటీ రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపడంపై మండిపడుతున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ ఎందుకు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు. మొదటి దఫా సాంకేతిక కారణాల వల్ల పేర్లు రాలేదని, మరికొన్ని జాబితాలు తప్పుగా వచ్చాయని, రెండో దఫా అన్నింటిని సరిచేస్తామని అధికారులు చెప్పారని, ఇప్పుడేం చెబుతారని నిలదీస్తున్నారు. రెండు జాబితాల్లోనూ పేర్లు లేకపోడంతో తమకు రుణమాఫీ ఇక అందని ముచ్చటనే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అమలు చేస్తున్న రుణమాఫీ జాబితాల్లో మెజార్టీ రైతుల పేర్లు గల్లంతయ్యాయి. పదులు, వందల సంఖ్యలోనే కాదు, ఏకంగా ఊళ్లకు ఊళ్లే జాబితాల నుంచి కనుమరుగయ్యాయి. రుణం తీసుకున్న వారిలో 40 శాతం మందికి కూడా మాఫీ వర్తించలేదు. కొన్ని చోట్లయితే కనీసం ఒక్కరికీ అమలు కాలేదు.
జగిత్యాల జిల్లా ఇండియన్ బ్యాంక్ ఐదు శాఖల పరిధిలో చూస్తే వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఒక్కో బ్రాంచ్ పరిధిలో కనీసం ఐదు నుంచి ఏడు గ్రామాల రైతులు పంట రుణాలు తీసుకున్నా పెద్ద సంఖ్యలో రైతులకు వర్తించలేదు. మొదటి దఫా ఐదు బ్రాంచ్‌ల పరిధిలో కేవలం ఒక్క రైతుకు మాత్రమే రుణమాఫీ జరిగింది. రెండో దఫా 1500 మందికి మాఫీ అయినట్టు జాబితా వచ్చింది. రాయికల్ మండలం మైతాపూర్లోనే మెజార్టీ రైతుల పేర్లు జాబితాల్లో కనిపించలేదు.
ఒక్క ఇండియన్ బ్యాంకే కాక, జిల్లాలో రెండు శాఖలతో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోనూ ఇదే దుస్థితి. 228 రుణం తీసుకోగా, అందులో కేవలం ఇద్దరికే మాఫీ జరిగింది. ఇక రెండో దఫా ఏ మేరకు జరిగిందన్న విషయం తెలియడం లేదు. సింగిల్ విండోల్లో మాఫీ పొందిన వారిలోనూ పెద్ద సంఖ్యలో పేర్లు గల్లంతు కాగా, వాటిని సైతం ఈ జాబితాలో సరిచేసిన పరిస్థితి కనిపించడం లేదు.
ఇటు కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. కొత్తపల్లి మండలం బావుపేటలోని ఇండియన్ బ్యాంక్ పరిధిలో లోన్ తీసుకున్న 700 మందిలో మొదటి విడుత కేవలం ఏడుగురికే మాఫీ జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూర్ ఇండియన్ బ్యాంకు పరిధిలో 14గ్రామాలకు చెందిన 640 మంది లోన్ తీసుకుంటే ఒకరిద్దరికి మాత్రమే మాఫీ అయింది. వేలాది మంది పేర్లు జాబితాలో గల్లంతు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తమవుతున్నది.
మాఫీ కోసం ప్రదక్షిణలు
మొదటి, రెండో జాబితాల్లో ఎక్కువ సంఖ్యలో పేర్లు గల్లంతు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పరిధిలో వేలాది మంది పేర్లు లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక అటు వ్యవసాయ అధికారులు, ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా వారికి సరైన సమాధానం రాక అయోమయానికి గురవుతున్నారు.
రుణమాఫీ జాబితాలో లేని వారి పేర్లను రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన బుక్‌లో రాయించుకోవాలని అధికారులు చెప్పగా అక్కడికి వెళ్తే రాసుకునే వారు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా అధికారులు రెండో విడుత పేరు చెప్పి దాటేశారని.. ఇప్పుడు రెండో విడుతలో కూడా పేర్లు లేవని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. కాగా జగిత్యాల డీఏవో వాణి మాట్లాడుతూ, రుణమాఫీ కాని రైతులు వివరాలు అందిస్తే ముప్పై రోజుల వ్యవధిలో వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
రెండు దఫాల్లోనూ రుణమాఫీ జరగని రైతులు తమ వివరాలను వ్యవసాయ అధికారులు, లేదా బ్యాంకుల పరిధిలో నమోదు చేసుకోవాలి. వాటినన్నింటిని పరిశీలిస్తాం. ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– రామ్‌కుమార్, లీడ్ బ్యాంక్ జగిత్యాల మేనేజర్
నమ్మకం పోయింది..
నాగుల మల్యాల గ్రామానికి చెందిన చట్టు సురేశ్ బావుపేటలోని ఇండియన్ బ్యాంక్‌లో గతంలో 30 వేల పంట రుణం తీసుకున్నాడు. మూడేళ్ల కింద కేసీఆర్ ప్రభుత్వంలో ఇది మాఫీ అయ్యింది. ఈ భరోసాతో మరోసారి 68వేల రుణం తీసుకున్నాడు. గతేడాది ఆగస్టు 10న రెన్యూవల్ చేసుకున్నాడు. ఈ సారి తనకు రుణమాఫీ వర్తిస్తుందని ఆశించిన సురేశ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపింది. మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశ చెందాడు. అధికారులను అడిగితే సరైన సమాధానం రాలేదని వాపోతున్నాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీతో తనకెంతో మేలు చేసిందని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని వాపోతున్నాడు. గత ప్రభుత్వం ఇచ్చినట్లయినా రైతు బంధు ఇస్తే బాగుండేదని, ప్రస్తుత పంటకు పెట్టుబడికి ప్రైవేట్ వ్యాపారుల వద్ద లక్ష అప్పుచేయాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నాడు.
గంగుకు మళ్లీ మొండిచెయ్యే
రాయికల్ మండలం మైతాపూర్‌కు చెందిన ఏనుగుల గంగు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నది. తనకున్న భూమిని ఇద్దరు కొడుకులు, కూతురికి పంచి ఇచ్చి, తన కోసం ఉంచుకున్న 1.37 ఎకరాల్లోనే మక్క సాగు చేస్తున్నది. రెండేండ్ల క్రితం పంట సాగు కోసం సమీపంలోని ఇండియన్ బ్యాంక్ శాఖలో 55 వేల లోన్ తీసుకుంది. క్రమం తప్పకుండా వడ్డీ కూడా చెల్లిస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ సర్కారు ఈ నెల 18న చేసిన తొలి విడత రుణమాఫీ జాబితాలో పేరు గల్లంతైంది. అధికారులను కలిస్తే, రెండో జాబితాలో ఉంటుందని హామీ ఇవ్వడంతో ఆమె ఆశగా సరేనంది. అయితే మంగళవారం ప్రభుత్వం జారీ చేసిన రెండో విడత జాబితాలోనూ గంగు పేరు లేకపోవడంతో కంగుతిన్నది. ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నది.
మైతాపూర్‌కు చెందిన పడిగెల గంగారెడ్డికి ఎవుసం తప్ప మరో పని తెలియదు. 4.11 ఎకరాల సాగు భూమి ఉన్నది. వరి, మక్కపంటను సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం తన నాలుగెకరాల భూమిపైన 95వేల రుణాన్ని ఇండియన్ బ్యాంక్‌లో తీసుకున్నాడు. ప్రతి నెలా క్రమం తప్పకుండా రుణం, వడ్డీ చెల్లిస్తూనే వచ్చాడు. అయితే మొదటి, రెండో విడుత రుణమాఫీ జాబితాలో పేరు లేకుండా పోయింది. దీంతో నిరాశే ఎదురైంది. కొమ్మెడి బుచ్చమ్మ, నెమళ్ల మోహన్‌రెడ్డి, కొల్ల రవి కుమార్, బొమ్మెన నర్సయ్య ఇలా చాలా మంది పేర్లు రెండు జాబితాల్లోనూ కనిపించలేదు.
రెండోసారి పేరు లేదు
మా ఊళ్లే నాకు 33 గుంటల పొలం ఉంది. ఎవుసం చేస్త. ఇన్నేండ్లల్ల నాకు లోన్ తీసుకునే అవసరం రాలె. అయితే పోయినేడాది పరిస్థితి బాగా మించుకురావడంతో తక్కళ్లపల్లి సింగిల్ విండో బ్యాంకుల 41వేలు తీసుకున్న. అప్పటి నుంచి వడ్డీ పైసలు సైతం కడుతూనే ఉన్నా. ఇప్పుడు నాకు వడ్డీ, అసలు కలిపి 41,613 బాకీ సంఘంలో ఉంది. సీఎం సార్, రైతు రుణమాఫీ చేత్తాం అంటుండు కదా..! అది కూడా లక్ష రూపాయలలోపు ఉన్నవారికి ముందు చేత్తున్న అంటుండు. నాకు కచ్చితంగా వస్తుందని అనుకున్న. తీరా లిస్టు చూస్తే అందులో నాపేరు లేదు. తక్కళ్లపల్లి విండోలో కలిసిన రెండోసారి రావచ్చు అన్నరు. రెండోసారి సైతం నా పేరు రాలేదు. ఈ కథేంటో అర్థమైతలేదు.
– జంగిలి పోచయ్య, తక్కళ్లపల్లి (మల్యాల మండలం)
మమ్ముల బాధలెందుకు పెడుతన్రు
మేం 2019ల మొలంగూర్ బ్యాంక్‌ల 36 వేల దాకా తీసుకున్నం. ఏటా వడ్డీ కట్టి రెన్యూవల్ చేసుకుంట వచ్చినం. ఈ నెల 22న నా భర్త బ్యాంక్‌కు వెళ్లి స్టేట్మెంట్ తీసుకున్నడు. రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. మాకు మాఫీ కాకపోవడానికి బాధ్యులెవరు. ఇప్పుడు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుడైతంది. బ్యాంకు ఆఫీసర్ల తప్పిదంలోనే మాఫీ కానట్లు తెలుస్తున్నది. మమ్ముల ఇట్ల బాధలెందుకు పెడుతన్రు? గతంలో రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో ఇలాంటి తప్పులు జరుగలేదు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి.
– పంజాల లక్ష్మి, కన్నాపూర్ (శంకరపట్నం)
50 వేలు కూడా మాఫీ కాలే..
నేను పెగడపల్లి ఎస్బీఐలో నాలుగేళ్ల కిందట 50 వేల క్రాప్‌లోన్ తీసుకున్న. దీనిని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రెన్యూవల్ చేసుకుంటున్న. మొదటి విడుతలో లక్ష లోపు మాఫీ చేయగా అందులో నా పేరు రాలే. వ్యవసాయ అధికారులు, బ్యాంకు వాళ్లను అడిగితే వస్తదని దాటేసిన్రు. మళ్లీ ఈరోజు 1.50 లక్షల లోపు మాఫీ చేసినట్టు లిస్ట్ వచ్చింది. అందులో కూడా నా పేరు రాలే. ఆధార్ కార్డు, పాస్ పుస్తకం పట్టుకుని బ్యాంకు, వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నా లాంటి పేద రైతుకు న్యాయం చేయాలి.
– లెంకలపల్లి రాజయ్య, రైతు (పెగడపల్లి)
రెన్యూవల్ చేస్తున్నా మాఫీ కాలే
నాకు మూడెకరాల భూమి ఉంది. వ్యవసాయమే ప్రధాన వృత్తి. రుద్రంగిలోని యూనియన్ బ్యాంక్‌ల 60 వేల క్రాప్‌లోన్ తీసుకున్న. ప్రతి సంవత్సరం లోన్ రెన్యూవల్ చేస్తున్న. మొదటి విడుత లక్ష లోపు వారికి మాఫీ అని సర్కారు చెప్పినా జాబితాలో నా పేరు రాలే. అధికారులను అడిగితే రెండో విడుత వరకు చూడమన్నరు. ఇప్పుడు రెండో విడుతల కూడా రాలే. నాకు రేషన్ కార్డు ఉంది. ఐటీ కట్టడం లేదు. అయినా మాఫీ కాలే. రుణమాఫీ జాబితా అంతా గందరగోళంగా ఉంది. అధికారులు స్పందించి నాకు మాఫీ వర్తించేలా చూడాలి.
– సామ రాజు, రైతు (రుద్రంగి)
నాగులమల్యాలలో 36 మందికే మాఫీ
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాలలో అందరూ చిన్న సన్నకారు రైతులే. ఒకప్పుడు మెట్టప్రాంతమైన ఈ గ్రామానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయాసలకు ఓర్చి సాగునీటి వసతి కల్పించింది. ఈ గ్రామంలో దాదాపు అందరూ లక్షలోపు రుణం తీసుకున్న వారే. గ్రామానికి సమీపంలో ఉన్న బావుపేటలోని ఇండియన్ బ్యాంక్‌లో సుమారు 20 మంది పంట రుణాలు తీసుకున్నా.. మొదటి దఫా ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. అలాగే కేడీసీసీబీ నుంచి లక్షలోపు రుణం తీసుకున్న రైతులు 61 మంది ఉంటే కేవలం 36 మందికే మాఫీ వర్తించింది.
ఇండియన్ బ్యాంకులో ఏడుగురికే..
కొత్తపల్లి మండలం బావుపేటలోని ఇండియన్ బ్యాంక్ పరిధిలో బావుపేటతోపాటు నాగుల మల్యాల, ఖాజీపూర్, కమాన్‌పూర్, బద్దిపల్లి, కొండాపూర్, ఎలగందల్, గంగాధర మండలం ఒద్యారం గ్రామాల రైతులు 700 మందికిపైగా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తుండగా, ఈ బ్యాంక్ పరిధిలో మొదటి విడుత కేవలం ఏడుగురికి మాత్రమే మాఫీ జరిగినట్టు సంబంధిత బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. అయితే బ్యాంక్ సర్వర్ సమస్య కారణంగా ఈ సమస్య ఏర్పడిందని, నాలుగైదు రోజుల్లో అర్హులైన రైతులందరికీ వర్తిస్తుందని చెబుతున్నా ఇప్పటికీ కాలేదు.
ఈ సారి కూడా లోన్ మాఫీ కాలె
మాది రొంపికుంట. ఊళ్లె ఉన్న 1.28 ఎకరాల భూమి మీద కమాన్‌పూర్ కేడీసీసీ బ్యాంకుల 2020లో ఫస్ట్‌సారి 55వేల క్రాప్ లోన్ తీసుకున్న. తర్వాత 2022ల రెన్యూవల్ చేయించుకొని 70 వేల రుణం తీసుకుని తప్పకుండా వడ్డీ కడుతున్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 18న ఇచ్చిన మొదటి దఫా జాబితాలో నా పేరు రాలేదు. అధికారులను అడిగితే రెండో ఫేజ్‌లో మాఫీ అయితదని చెప్పిన్రు. రెండో విడుతలో కూడా మాఫీ కాలేదు. ఏఈవోను అడిగితే.. మీకు పింకు రేషన్ కార్డు ఉన్నందున మాఫీ అయితలేదు కావచ్చని అన్నరు. కానీ, మా ఊరిలో సింగరేణి ఉద్యోగులకు రుణం మాఫీ అయ్యింది. నేను ప్రైవేట్ ఉద్యోగిని. ఐటీ చెల్లించడం లేదు. నాకు గతంలో రైతుబంధు, పీఎం కిసాన్ డబ్బులు వచ్చేవి. కానీ, ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పథకాల్లో గందరగోళం సృష్టిస్తున్నది. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడే అర్హులందరికీ అన్ని పథకాలు అందినయ్. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పుతూ రైతులను మోసం చేస్తున్నది. అర్హులందరికీ రుణాలు మాఫీ చేస్తారా..? లేదా..? అన్నది సందిగ్ధంగా మారింది.
– కొయ్యడ శ్యామ్, రొంపికుంట, కమాన్‌పూర్ (పెద్దపల్లి కమాన్)
ఎవర్ని అడుగాల్నో..
నాకు పదిరలో మూడెకరాల భూమి ఉంది. ఏడాది కింద ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల 90 వేల అప్పు తీసుకున్న. మొదటి విడుతలోనే రుణమాఫీ అయి నట్టు లిస్టులో పేరు వచ్చింది. కానీ, బ్యాంకుకు పోయి అడిగితే మాఫీ కాలే దన్నరు. ఎవరిని అడగాల్నో తెలుస్తలేదు.
– తాళ్లపల్లి శ్రీనివాస్, పదిర (ఎల్లారెడ్డిపేట)
రెండో విడుతలో కూడా కాలే..
నాకు మా ఊరిలో రెండెకరాల భూమి ఉన్నది. అందులో వరి సాగు చేస్తున్న. నేను అల్లీపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2022 డిసెంబర్ 19న 90 వేల క్రాప్‌లోన్ తీసుకున్న. ఇటీవల కాంగ్రెస్ సర్కారు మాఫీ చేసిన రుణమాఫీకి నేను అన్ని విధాలా అర్హుడిని. కానీ, మొదటి విడుతలో నా పేరు రాలేదు. దీంతో బ్యాంకు, వ్యవసాయ అధికారులను అడిగితే రెండో విడుతలో మాఫీ అయితదని చెప్పిన్రు. కానీ, రెండో విడుతలో కూడా నా పేరు రాలే. దీంతో మంగళవారం బ్యాంకుకు వెళ్లి ఫీల్డ్ ఆఫీసర్‌ను అడిగితే మాకు తెలియదు వ్యవసాయ అధికారులను అడగాలని చెప్పిన్రు. అసలు నాకు రుణమాఫీ అవుతుందా..? కాదా..? అర్థం కావడం లేదు.
– చల్ల లక్ష్మీనారాయణ, కిష్టంపేట (రాయికల్)
అంతా మోసం.. 1.40 లక్షలకు 3,467 మాఫీనా..?
మల్యాలలో నాకు మూడెకరాల పొలం ఉంది. దాని నమ్ముకొనే మేం బతుకుతున్నం. నేను, నా భార్య శంకరమ్మ ఇద్దరం వ్యవసాయం చేస్తం. మాకు ముగ్గురు పిల్లలు. 2023 జనవరి 19న మల్యాల సింగిల్ విండో కార్యాలయంలో 1.40లక్షల లోన్ తీసుకున్న. ప్రతి నెలా వడ్డీ కూడా కడుతున్న. లక్ష దాటినయని రెండో విడుత మాఫీ అయితయని అనుకున్న. తీరా చూస్తే ఫస్ట్ లిస్టులో నాపేరచ్చింది. సింగిల్ విండో ఆఫీస్‌కు వెళ్లి సార్‌ను కలిసిన. నాపేరు మీద 3,467 మాఫీ చేసినట్టు ఉండడంతో ఆశ్చర్యపోయిన. నేను 1.40లక్షల లోన్ తీసుకుంటే 3,467 రుణం మాఫీ చేసిన్రు. మరి మిగిలిన డబ్బులు నేను కట్టుడా..? లేదా..? నాకు మాఫీ అయ్యిందా కాలేదా..? అని సర్‌ను అడిగిన. మీ పేరు, వివరాలు రాసి ప్రభుత్వానికి పంపుతనని చెప్పిండు. రెండో తాపకు మాఫీ అయితదని అనుకుంటే లిస్టులో నా పేరే రాలేదు. రుణమాఫీ మోసంలా కనిపిస్తుంది.
– సిరికొండ శంకరయ్య, మల్యాల