Peddapally | పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 12 : పెద్దపల్లి మండలం బొంపల్లి గుట్టల వెంట నడిస్తున్న అనుమతులు లేని అక్రమ బండ క్వారీల్లో బ్లాస్టింగ్ లతో బండరాళ్లు ఎగిరి పడి మా పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లుతోందని బొంపల్లి గ్రామ బాధిత రైతులు పెద్దపల్లి-ధర్మారం రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేశారు. రైతుల రాస్తారోకో తో గంట పాటు ఆ మార్గంలో ప్రయాణికులు, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న పెద్దపల్లి రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న రైతులు, గ్రామస్తులతో మాట్లాడి విరమింప జేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ బొంపల్లి గుట్టకున్న బండ క్వారీలలో కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, వాటి పేరుతో అనుమతుల సాకుతో అనేక అక్రమ క్వారీలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఈ బండ క్వారీ వల్ల మా పంట పొలాలు పాడవుతున్నాయని అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోతున్న తమకు సమాన విలువ కల్గిన భూముల ను ఈ ప్రాంతంలో మరో చోట ఇప్పించాలని, లేదంటే క్వారీలను మొత్తానికే తీసివేయాలని రైతులు డిమాండ్ చేశారు.