‘వైద్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అన్నిరంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నది. రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించినా గత ప్రభుత్వాలు ఒక్క మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయలేకపోయాయి. కానీ, మేం అధికారంలోకి వచ్చిన ఏడెమిదేండ్లలోనే జిల్లాకొకటి చొప్పున అందించిన ఘనత సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం మరో మంత్రి గంగులతో కలిసి జిల్లా ప్రధాన దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాలసిస్ సేవల్లో దిశానికే దిక్సూచిగా నిలిచిందని, ఇందులో తెలంగాణను మోడల్‌గా తీసుకుంటామని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పడం మన రాష్ర్టానికే గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. కరీంనగర్లో 100 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కళాశాలు ప్రారంభిస్తామని వివరించారు.
– విద్యానగర్, డిసెంబర్ 29
కరీంనగర్‌కు త్వరలోనే వంద పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్‌ను మంజూరు చేస్తామని రాష్ట్ర వై ద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం జిల్లా ప్రభుత్వ దవాఖానతోపాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంసీహెచ్‌లో గర్భిణులు, బాలింతలతో సేవలపై అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం ప్రధాన దవాఖానలోని మేల్, ఫీమేల్ వార్డులతో పాటు పాలియేటివ్ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్లను పరిశీలించారు. దాదాపు రెండు గంటలపాటు అక్కడే ఉండి దాదాపు 50 మంది రోగులతో ముచ్చటించారు. సేవలు, రోజువారీగా ఇస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు.
వైద్యసిబ్బంది పనితీరు భేష్
కరీంనగర్ జిల్లా దవాఖానలో నెలకు 750 ప్రసవాలు జరుగుతున్నాయని, ఇంత ఒత్తిడిలో కూడా వైద్యులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దవాఖానలో వైద్యులు, సిబ్బంది పనితీరు గైనిక్, సర్జికల్, ఆర్థోపెడిక్, డయాలసిస్, పాలిటివ్ కేర్, ఇలా దాదాపు ఆరేడు వార్డుల్లో రోగులతో మాట్లాడానని, సేవలపై సంతృప్తిగా ఉన్నారని వివరించారు. డయాలసిస్ రోగులతో కూడా మాట్లాడానని, వారానికి మూడు సార్లు డయాలసిస్ సేవలు ఉచితంగా పొందుతున్నట్లు చెప్పారని వివరించారు. సీఎం కేసీఆర్ బస్‌పాస్‌లు ఇచ్చారని, ఆసరా పింఛన్లు కూడా వస్తున్నాయని, దవాఖానలో మంచి సేవలు అందుతున్నాయని తెలిపినట్లు చెప్పారు.
ఎక్కడా లేని విధంగా పాలియేటివ్ సేవలు..
క్యాన్సర్‌తో బాధపడుతూ చివరి దశలో ఉన్న రోగుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రా ష్ట్రంలోని 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అంతేకాకుండా ఇంటి వద్దకే వచ్చిన సేవలందించేందుకు ఆలనా వాహన సేవ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. పాలియేటివ్ సెంటర్లో ఉంటున్న వృద్ధ దంపతులను పలుకరిస్తే రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నట్లు చెప్పారని, మంచి వైద్యంతోపాటు ఆహారం అందిస్తున్నారని, వైద్యులు ధైర్యాన్ని ఇస్తున్నట్లు చెప్పారని వివరించారు. దవాఖానలో అందుతున్న సేవలకు ఎన్ని మార్కులు వేస్తావని ఓ రోగిని ప్రశ్నిస్తే 90 మార్కులు వేస్తానని చెప్పారని చెప్పుకొచ్చారు. కాగా, రోగులతో వైద్య సిబ్బంది ప్రేమ, అప్యాయతతో మెలగాలని సూచించారు.
వచ్చే ఏడాది నుంచే మెడికల్ కళాశాల
జిల్లాలో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయని, కరీంనగర్ ప్రజల కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరగా, సీఎం కేసీఆర్ అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే జగిత్యాల, రామగుండం జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో కరీంనగర్లో మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలు ప్రారంభమవుతాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించినా గత ప్రభుత్వాలు ఒక్క మెడికల్ కళాశాలను నిర్మించలేకపోయాయని, కానీ మేం అధికారంలోకి వచ్చిన ఏడెమిదేళ్లలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అందించిన ఘనత సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వివరించారు.
రూ. 18 కోట్లతో సౌకర్యాలు..
కరీంనగర్లో మెడికల్ కళాశాలకు తక్షణమే 18 కోట్లతో తరగతి గదులు, ల్యాబ్‌లు, స్టాప్ క్వార్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కరీంనగర్లో మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ డయాలసిస్, ఐసీయూ, పాలియేటివ్ కేర్, పారామెడికల్ కోర్సులను కరీంనగర్లో ప్రారంభమవుతాయని వివరించారు. జిల్లాలో జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్నాయని, రాష్ర్టానికి జంక్షన్‌గా ఉందని, ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బందిగా ఉందని, క్రిటికల్ కేర్ యూనిట్ కావాలన్న మంత్రి గంగుల కోరిక మేరకు 100 పడకల క్రిటికల్ కేర్ దవాఖానను కరీంనగర్‌కు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 33 జిల్లాల్లో సైతం అక్కడి అవసరాలను బట్టి 50 నుంచి 100 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మంచి వైద్యం అందుతుందని చెప్పారు.
మన సేవలకు తమిళనాడు సీఎం ప్రశంసలు
డయాలసిస్ సేవల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటామని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పడం మన రాష్ర్టానికి గర్వకారణమని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సేవలు ఉచితంగా అందించామని, ఈ సేవల కోసం ఏడాదికి 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తామని చెప్పగానే కేంద్ర ప్రభుత్వం దేశమంతా జిల్లా కొకటి పెడుతామని ప్రకటించిందని, వాళ్లు పెట్టేది ప్రైవేట్, లేదంటే గవర్నమెంట్, కానీ సీఎం కేసీఆర్ పేద ప్రజలకు వైద్యం, వారి పిల్లలకు వైద్య విద్య కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రం వచ్చినప్పుడు 5 మెడికల్ కాలేజీలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 17కు చేరిందన్నారు. 2023 సంవత్సరానికి 25కి చేరుతాయన్నారు. వైద్య విద్యలో ప్రథమ, పీజీ వైద్య విద్యలో ద్వితీయ, దేశంలోనే వైద్య సేవల్లో తృతీయ స్థానంలో మన రాష్ట్రం ఉందన్నారు. ఇవి నేను చెప్పిన లెక్కలు కాదని, కేంద్ర ప్రభుత్వంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పిందని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ పబ్లికేషన్స్ చెప్పిందన్నారు. డబుల్ ఇంజిన్ అని చెప్పుకుంటున్న రా ష్ర్టానికి చిట్ట చివరి స్థానం దక్కిందన్నారు. సింగిల్ ఇంజిన్ ఉన్న తెలంగాణ రాష్ట్రం రాకెట్ స్పీడ్‌తో మూడో స్థానంలో నిలిచిందన్నారు.
కరీంనగర్ అంటేనే రిజర్వాయర్ల ఖిల్లా
కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా, వాటర్ హ బ్గా మారిందని మంత్రి అభివర్ణించారు. కాళేశ్వ రం జలాలు ముందుగా కరీంనగర్‌ను ముద్దాడిన తర్వాతే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్తాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా అంటే సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ అని, ఉమ్మడి జిల్లాలో నాలుగు కొత్త జిల్లాలో మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం లో 500 పడకలతో నూతనంగా హాస్పిటళ్లు ప్రారంభమవుతున్నాయని వివరించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పౌరసరఫరాల శాఖ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్, మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నాయకులు ఈద శంకర్ రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, డీఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా, ఆర్ఎంఓ డాక్టర్ జ్యో తి, డాక్టర్లు సాయిని నరేందర్, రవీందర్, మం జుల, అలీం, ఎవో నజీముల్లాఖాన్, ఆఫీస్ సూపరింటెండెంట్ పుల్లెల సుధీర్ ఉన్నారు.