peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారి పై శనివారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య తెలిపారు. పెద్దపల్లి భూం నగర్ లోని సర్వే నెంబర్ 694 లో ఉన్న 309 చదరపు గజాల భూమి ఠాకూర్ శంకర్ సింగ్ 2009 లో కొనుగోలు చేశారని, ఆయన మరణం తర్వాత కూతురు ఠాకూర్ మధుమిత, తల్లి ఠాకూర్ శ్యామల తాము మాత్రమే హక్కుదారులమని తప్పుడు పత్రాలు చూపించి, కుమారుడు ఠాకూర్ అభిలాష్ ఉన్నట్లు మరిచి రిలీజ్ రైట్స్ డీడ్ పొందారని తెలిపారు.
ఠాకూర్ శంకర్ సింగ్ కుమారుడు ఠాకూర్ అభిలాష్ సైతం అప్పటి కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి కిషోర్ బాబుతో కుమ్మక్కై అతని తల్లి శ్యామల చనిపోయినట్లుగా తప్పుడు డెత్ సర్టిఫికెట్ ను సృష్టించి సదరు భూమిని ఠాకూర్ సాయి సంతోష్ కు పెద్దపల్లి సబ్ రిజిస్టర్ ను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించారని అన్నారు.
ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించినందుకు గాను ఠాకూర్ శంకర్ సింగ్ కుమార్తె ఠాకూర్ మధుమిత ఏ1, భార్య ఠాకూర్ శ్యామల ఏ2, కుమారుడు ఠాకూర్ అభిలాష్ ఏ3, ఠాకూర్ సాయి సంతోష్ ఏ4, ప్రస్తుతం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కిషోర్ బాబును ఏ5 గా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.